– ఉప్పల్ స్టేడియం వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. మార్చి 22న మొదలైన ఈ మెగా టోర్నీలో సన్‌రైజర్స్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లను సాధించింది. ఈ టోర్నీలోనే రెండు సార్లు అత్యధిక స్కోర్లు సాధించి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. సొంత స్టేడియం ఉప్పల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది సత్తా చాటింది. అయితే, సన్‌రైజర్స్ బాగా ఆడుతుండటంతో ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లను చూసేందుకు ఫ్యాన్స్ మరింతగా తహతహలాడుతున్నారు. దీంతో టికెట్లు రిలీజ్ చేయడమే ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే, కొంతమంది క్యాష్ రిచ్ లీగ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ దందాకు తెరతీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఐపీఎల్ టికెట్ల పేరిట క్రికెట్ ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టిస్తున్నారని.. కాబట్టి టికెట్లు కొనాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఐపీఎల్‌లో బ్లాక్ దందాకు పాల్పడుతున్నారని.. దీనికి అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుకు ఈ విషయమై వినతి పత్రం ఇచ్చేందుకు విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఉప్పల్ స్టేడియం వద్దకు వచ్చారు. అయితే, స్టేడియం భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు స్టేడియం సిబ్బందిని తోసుకుని లోపలికి వెళ్లారు. దీంతో స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్లాక్ దందా నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థి సంఘాలు తరలివచ్చినట్లు సమాచారం.