కాలం మారింది..! కాలానుగుణంగా ఆచార వ్యవహారాలు మారిపోయాయి. ఇప్పుడు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు.
అదేవిధంగా పేదాపెద్ద అన్న బేధం లేకుండా తమ స్థాయినిబట్టి పెండ్లిరోజులను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక ప్రతి ఏడాది డిసెంబర్ 31 అర్ధరాత్రి అయ్యిందంటే ప్రపంచమంతా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తుంది.
ఇలా సందర్భం ఏదైనా ఒక్కటి మాత్రం కామన్‌గా ఉంటుంది. అదే కేక్ కట్ చేయడం.
ఇలా కేక్ కట్ చేసే సందర్భంలో ఆ కేక్‌లపై క్యాండిళ్లు పెట్టి ఊదుతుంటారు. ఇలా కేక్‌లపై క్యాండిళ్లు పెట్టి ఊదడం చాలా ప్రమాదకరం తెలుసా..?
పుట్టినరోజు, పెండ్లి రోజు, ఇతర శుభ సందర్భాల్లో బంధువులు, స్నేహితుల మధ్య కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకోవడం వరకు ఎలాంటి సమస్య లేదు.
అయితే ఆ కేకుల మీద కొవ్వుత్తులను వెలిగించి వాటిని నోటితో ఊదడంతోనే అసలు సమస్య ఉన్నది.
ఎందుకంటే కేకులపై క్యాండిళ్లను నోటితో ఊదడంవల్ల లాలాజలం ఎంతోకొంత తుంపరగా వాటిపై పడుతుంది.
అప్పుడు లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా కేకులో చేరుతుంది.
ఇలా చేరిన బ్యాక్టీరియా కేక్‌పై ఉన్న చల్లని క్రీమ్ లేయర్ వల్ల 15 వేల శాతానికిపైగా పెరిగి కేక్ మొత్తం విస్తరిస్తుందట. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
కూలీ ఇచ్చి నెత్తిమీద కొట్టించుకున్నట్టే..
కేక్‌పైన క్యాండిల్ ఊదిన వ్యక్తి ఆరోగ్యవంతుడైతే అతని తుంపర్లతో వచ్చే బ్యాక్టీరియా అంతగా హాని చేయదట.
మనలోని వ్యాధినిరోధక వ్యవస్థకు ఆ బ్యాక్టీరియాను ఎదిరించే శక్తి ఉంటుందట.
కానీ ఆ వ్యక్తికిగనుక జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం లాంటి ఇన్ఫెక్షన్లు ఉంటే మాత్రం అవి కచ్చితంగా కేక్ తిన్న అందరికీ అంటుకుంటాయట.
అందుకే మనం కేకులు కట్‌చేసినా.. వాటిపైన క్యాండిళ్లు పెట్టి ఊదే సంప్రదాయాన్ని మాత్రం వదిలి పెట్టాల్సిందే.
లేదంటే మాత్రం ‘కూలీ ఇచ్చి నెత్తిమీద కొట్టించుకున్నట్టే’ అవుతుంది.
నోటి తుంపర్లలోని బ్యాక్టీరియాతోనే ఇంత ప్రమాదం ఉందంటే.. ఇప్పుడు దానికి కరోనా వైరస్ కూడా తోడయ్యింది.
అంటే మనం ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇదేమీ మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న విషయం కాదు.
చాలా రోజుల క్రితమే దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు శాస్త్రీయంగా ఈ విషయాన్ని నిరూపించారు.
కేక్‌పై క్యాండిల్‌ను ఊదినప్పుడు నోటి నుంచి పడిన బ్యాక్టీరియాతో పోల్చితే 15 నిమిషాల తర్వాత ఆ కేక్‌పై బ్యాక్టీరియా దాదాపు 15 వేల శాతం ఎక్కువగా ఉందని రిసెర్చర్స్ ఎన్నో పరిశోధనలు చేసి గుర్తించారు.
అందుకే పుట్టినరోజు వేడుకల్లో కేక్‌పై క్యాండిల్స్ పెట్టి ఊదే పద్ధతికి చెక్ పెట్టడమే ఉత్తమమని వారు చెబుతున్నారు.
ఇకపై మీరు కూడా అలాంటి అలవాటు ఉంటే మానుకోవాల్సిందే మరి.