ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఎన్నికల సమయంలో బ్లూ ఇంక్ ప్రత్యేకమైనది. ఓటు వేసినట్లుగా గుర్తుగా అధికారులు ఈ ఇంకును భావిస్తారు. చూపుడువేలిపై బ్లూ సిరాను రాస్తారు. దాదాపు 10 నుంచి 15 రోజల వరకూ ఈ మరక పోకుండా ఉంటుంది. అసలు ఎందుకు ఇలా చేస్తారు..ఈ సిరా ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.
దొంగ ఓట్లు
దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత మొదటిసారి ఎన్నికలు జరిగాయి. సరైన విధివిధానాలు లేక దొంగఓట్లు పడ్డాయి. ఓటేసినవారిని గుర్తించడం కష్టమయింది. మిస్టేక్స్ జరిగాయి. దీనినుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం, అధికారులకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఓటు వేసిన వారిని సులభంగా గుర్తు పట్టేందుకు సిరాను వాడాలనుకున్నారు. వేలిపై సిరాగుర్తు వేయాలని నిర్ణయించుకున్నారు.
మొదటిసారిగా..
1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొదటిగా ఈ బ్లూ సిరాను ఉపయోగించారు. అప్పుడు సుకుమార్ సేన్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిచ్చింది. ఓటు వేసినవారిని సులభంగా గుర్తించే వీలు దక్కింది. ఆ తర్వాత ఈ విధానాన్ని కొనసాగించారు.
ఎంత ఖర్చు..
2019 ఎన్నికల్లో దాదాపు 26 లక్షల వయల్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించింది. దీనికి అయిన ఖర్చు దాదాపు రూ. 33 కోట్లు. ప్రస్తుత జరుగుతోన్న 2024 ఎన్నికల్లో రూ. 55 కోట్ల ఖర్చుతో 26.5 లక్షల వయల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఒక్కో వయల్‌లో 10 మిల్లీమీటర్ల సిరా ఉంటుంది. దాదాపు 700 మందికి ఒక్క వయల్ ద్వారా సిరా గుర్తును వేయవచ్చు.
తయారీ
ఈ సిరాను తయారు చేయడానికి కావాల్సిన ఫార్ములాను రహస్యంగా ఉంచుతారు. కేవలం భారత ఎన్నికల సంఘానికి మాత్రమే తెలిసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీన్ని మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా తయారు చేయిస్తారు. కేవలం అందులో పనిచేసే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఈ ఫార్ములా గురించి తెలుసు. ఒకవేళ రిటైర్మెంట్, అకస్మాత్తుగా మరణిస్తే ఇతర అధికారులకు ఈ ఫార్ములా గురించి వివరిస్తారు.
విదేశాలకు
ఎన్నికల్లో ఉపయోగించే ఈ సిరాను కేవలం భారత్ మాత్రమే కాకుండా అనేక దేశాలు వాడుతున్నాయి. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేసియా, నేపాల్, దక్షిణాఫ్రికా సహా 25కి పైగా దేశాలు మన సిరాను దిగుమతి చేసుకుంటున్నాయి.