ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం, ముంబయిలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు బిగ్‌బీ బంగ్లా, రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో అన్ని చోట్లా విస్తృత తనిఖీలు చేపట్టారు.
అయితే అది నకిలీ బెదిరింపు కాల్ అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తనిఖీల్లో ఎటువంటి అనుమానిత పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు.
ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి పలు చోట్ల బాంబులు అమర్చినట్టు చెప్పాడు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినల్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లు, జుహూలోని అమితాబ్ బంగ్లా వద్ద బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు వెల్లడించాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సమాచారమిచ్చారు.
బాంబు స్క్వాడ్, జాగిలాలను తీసుకొని బిగ్‌బీ నివాసం సహా రైల్వే స్టేషన్ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు దొరక్కపోవడంతో నకిలీ ఫోన్‌గా నిర్ధారణకు వచ్చారు.
అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.
అది నకిలీ బెదిరింపు కాల్‌గా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.
అతడి కోసం దర్యాప్తు సాగుతున్నట్లు పేర్కొన్నారు.