– అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ గెలుపు
– నాలుగుకు పెరిగిన కాంగ్రెస్ సీట్లు
– ఎంఐఎం ఖాతాలో చార్మినార్
– జనసేనకు డిపాజిట్లకు గల్లంతు
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ అంజనీకుమార్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బోణీ కొట్టింది. అంబర్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ తన సమీప అభ్యర్థి రోహిన్రెడ్డిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ రామంగుడం అభ్యర్థి రాజ్‌ఠాకూర్, జుక్కల అభ్యర్థి లక్ష్మీకాంత్ రావు గెలుపొందడంతో ఆ పార్టీ విజయం సాధించిన సీట్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఎప్పటిలాగే చార్మినార్ స్థానాన్ని ఎంఎంఐం దక్కించుకుంది. తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇదిలా ఉండగా.. డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ ఇంటి వద్ద పోలీసులు సెక్యూరిటీని పెంచారు. ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అయితే, ఆయన ర్యాలీలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కండువాలు సైతం కనిపించడం గమనార్హం.