- ఉదయం 10 :15 నుంచి 11:15 గంటల వరకు
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు..
- ఒక్కో టికెట్ రూ.300.. దానికి ఒక లడ్డూ ఉచితం
- అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మొట్టమొదటిసారి బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తున్నారు. సోమవారం ఆలయంలో నుంచి బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. ఆలయంలోని ప్రస్తుత శీఘ్రదర్శనం క్యూలైన్‌ను బ్రేక్ దర్శనాలకు ఉపయోగించుకుని, శీఘ్రదర్శనం భక్తులను ఆలయ తూర్పు ద్వారం నుంచి నేరుగా పంపించేందుకు క్యూలైన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతీ రోజు రెండుసార్లు…
బ్రేక్ దర్శనాలను నిత్యం రెండుసార్లు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10:15 నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగనున్నాయి. ఇందుకు రూ.300 టికెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ టికెట్‌కు ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించనున్నారు.
శ్రావణమాసం ఉత్సవాలకు ఏర్పాట్లు…
రాజన్న సన్నిధిలో సోమవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు శ్రావణమాసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజులపాటు భక్తుల రాకతో రాజన్న క్షేత్రం సందడిగా మారనుంది. ప్రతీ సోమవారం ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ప్రతీ శుక్రవారం ఆలయ అనుబంధ మహాలక్ష్మి ఆలయంలో చతుష్షష్టి పూజలు నిర్వహించనున్నారు. శ్రావణమాసంలో ఐదు సోమవారాలు, నాలుగు శుక్రవారాలు వస్తున్నాయని అర్చకులు పేర్కొన్నారు.