ఇదేనిజం, శేరిలింగంపల్లి: ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా అమాయక కస్టమర్‌లకు అందమైన అమ్మాయిలను ఎరవేసి పబ్బులకి పిలిచి లూటీ చేస్తున్న 7 గురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి 2 కార్లు, రూ. కోటి విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు..ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ వినీత్ వెల్లడించారు. ఆకాశ్‌కుమార్, సూరజ్‌కుమార్, అక్షత్ నరుల, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్‌కుమార్, చెర్కుపల్లి సాయికుమార్ లు ఢిల్లీలో డెవిల్స్ నైట్ క్లబ్ నడుపుతున్నారు. వీరంతా అమ్మాయిలను రిక్రూట్ చేసే ఆన్‌లైన్ యాప్‌లలో నమోదు చేసుకుంటారు.
అందమైన అమ్మాయిల ఫోటోలతో చాటింగ్ చేసి వీరు ఎంచుకున్న పబ్ కు రప్పిస్తారు. ఇక్కడ ఖరీదైన మద్యం తాగించి వచ్చిన లాభాలను వీరంతా కలిసి పంచుకుంటున్నారు. ఇలాంటి ముఠాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలల్లో మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల మాదాపూర్ లోని మోష్ పబ్ లో ఇలాంటి నిర్వాకం బయటపడింది. ముఖ్యంగా నష్ట స్థితిలో ఉన్న పబ్, గూగుల్ రేటింగ్‌లు చాలా తక్కువగా ఉన్నవాటిని ఎంచుకొని ఇలా మోసాలకు తెగబడుతున్నారు. ఇప్పటివరకు వీరు సుమారు 50-60 మంది కస్టమర్ల నుండి 30 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు.
ఈ మోసం కోసం వారు Tinder, hinz , bambel యాప్‌లను వినియోగించినట్లు గుర్తించారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆకాశ్‌కుమార్, సూరజ్‌కుమార్, అక్షత్ నరుల, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్‌కుమార్, చెర్కుపల్లి సాయికుమార్ అనే నిందితులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 8 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 2కార్లు దాదాపు రూ.కోటి విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పీఎస్‌కు చెందిన జి.మల్లేష్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకట రమణ, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్.జగన్, కేశవులు పాల్గొన్నారు.