అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి విమర్శలతో లోక్‌సభ సోమవారం అట్టుడుకుతోంది. లోక్‌సభలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకే తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. భయపడవద్దు అని ప్రతి మతంలోనే చెప్పబడిందన్నారు. హిందువులమని చెప్పుకునే వారు హింసకు పాల్పడుతున్నారన్నారు. సభలో శివుని పోస్టర్‌ను రాహుల్ ప్రదర్శించారు.
రాజ్యాంగంపై దాడి జరుగుతోంది
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము పోరాడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాడితే అణచివేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. నా ఎంపీ పదవిని, ఇంటిని లాగేసుకున్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలచే ఇబ్బందులకు గురిచేశారు’’ అని అన్నారు.
శివుడి ఫొటో చూపిస్తే తప్పేంటి?
లోక్‌సభలో శివుడి ఫొటో చూపిస్తే తప్పేంటని అధికార పక్షాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ. సభలో ఎటువంటి ఫ్లకార్డులు ప్రదర్శించరాదన్న నియమాన్ని ఎత్తిచూపుతూ.. మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ ప్రశ్నించారు. సభలో రాజ్యాంగాన్ని, శివుని చిత్రాలను చూపెట్టడం తప్పెలా అవుతుందని అడిగారు. తాను శివుని నుంచి స్ఫూర్తి పొందానని తెలిపారు.
హిందూ సమాజం అంటే మోదీ మాత్రమే కాదు
హిందూ సమాజం అంటే కేవలం మోదీ మాత్రమే కాదని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హిందూ సమాజం అంటే ఒక్క బీజేపీ, ఒక్క ఆర్ఎస్‌ఎస్ మాత్రమే కాదు. ఈ సభలో ఉన్నవారు, బయట ఉన్నవారంతా హిందువులే. బీజేపీ 24 గంటలూ హింసను ప్రేరేపిస్తుంది. దేశ ప్రజలను భయకంపితులను చేస్తోంది. హిందువులు హింసను ప్రేరేపించరు’’ అని రాహుల్ తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలపై మోదీ అభ్యంతరం
హిందూ సమాజం అంటే కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదని.. హిందూత్వం పేరుతో ప్రజలను బీజేపీ భయపెడుతోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అనడంపై ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. యావత్ హిందూ సమాజంపై సభలో మాట్లాడటం తీవ్రమైన అంశమని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. శివుడి ప్లకార్డులను రాహుల్ గాంధీ సభలో ప్రదర్శించడాన్ని స్పీకర్ ఓం బిర్లా వ్యతిరేకించారు.