బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 8న అరుణ్ అనే విద్యార్థి అనుమానస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గు మంటున్నాయి. NSUI, ABVP, SFI వంటి విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపాయి. కళాశాలలో తరగతులు బంద్ చేసి విద్యార్థులు సైతం కాలేజీ వద్ద భైఠాయించారు. మరోవైపు మృతుడి బంధువులు కళాశాలలో ఫర్నిచర్, అద్ధాలను ధ్వంసం చేసారు. ఈ తరుణంలోనే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన షేట్ బషీర్ బాద్ పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. విద్యార్థి మరణం పై కళాశాల యాజమాన్యం స్పందించాలని.. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన పై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరారు. దీంతో మల్లారెడ్డి యూనివర్సిటీ అంతా ఒక్క సారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.