తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం రూపకల్పన తుది దశకు చేరుకున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఈ రెండింటిని మార్పులు చేస్తూ కొత్తగా ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు చార్మినార్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి చార్మినార్‌ను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌కు ఐకాన్‌గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు.
చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని కేటీఆర్ అన్నారు. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని ఆరోపించారు. మరోవైపు కాకతీయ కళాతోరణం తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు.