– ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపణలు
ఇదే నిజం, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఉద్యోగాలు రాక అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ఆ ఆత్మహత్యలకు కల్వకుంట్ల కుటుంబ పాలనే కారణమని విమర్శించారు. నవంబరు 30న తెలంగాణ యువత వారికి తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ యువతను ఆదుకునేందుకు ప్రతి స్టూడెంట్‌కు రూ.లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తాం. దాన్ని ఉపయోగించి స్టూడెంట్లు కాలేజీ ఫీజులు చెల్లించుకోవచ్చు. కోచింగ్ ఫీజులు, విదేశీ విద్యా ఫీజులు కట్టవచ్చు. అవసరమైనవారు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కొనుగోలు చేయొచ్చు. అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆ మేరకు మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటాం. ఏడాదిలోపు ఉద్యోగాలన్నీ భర్తీ అయ్యేలా చర్యలు చేపడతాం. తొలి కేబినెట్‌లోనే మెగా డీఎస్సీని ప్రకటిస్తాం. నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అతిక్రమణలకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించేలా టీఎస్‌పీఎస్సీలో మార్పులు చేస్తాం. గ్రామీణ యువత ఉపాధి పొందే పథకాలను ప్రవేశపెడతాం’అని సూర్జేవాలా వివరించారు.