– గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
– కరుడుగట్టిన ఉద్యమవాది చెరుకు సుధాకర్ : హరీశ్ రావు
ఇదేనిజం, హైదరాబాద్: ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సుధాకర్‌తో పాటు నకిరేకల్, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమవాది చెరుకు సుధాకర్ అని కొనియాడారు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారని విమర్శించారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘనత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిదన్నారు. రేవంత్ సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారన్నారు.