Homeహైదరాబాద్latest Newsగుండెల్ని పిండేసే ఘటన, శోకంలో రైతు

గుండెల్ని పిండేసే ఘటన, శోకంలో రైతు

ఇదే నిజం, రామగిరి : రైతు మంచి స్నేహాన్ని కోల్పాయాడు. తన కష్టంలో పాలు పంచుకునే తోడు ఇక సెలవు అని చెప్పింది. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఓ రైతుకు ఇన్నాళ్లూ నేనున్నానంటూ జీవితంపై భరోసా కల్పించిన మూగజీవి ప్రాణాలు వదలి అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఎండనకా..వాననకా, పగలనకా..రేయనకా యజమానితో పని చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తోన్న ఎద్దును పాముకాటు బలితీసుకున్న హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..మాటేటి పర్వతాలు అనే రైతు రోజూ మాదిరిగానే పొలం పనులకు వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో ఎద్దును ఓ చెట్టుకింద కట్టేసాడు. కాసేపటికి వచ్చి చూసేసరికి నురగలు కక్కుతూ ఆ ఎద్దు విలవిలడుతోంది. ఇది చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యాడు. టెన్షన్‌తో అటూఇటూ తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ మూగజీవాన్ని చూసి రైతు చలించిపోయాడు. పాముకాటు వేసిందని గ్రహించి వెంటనే స్థానిక పశువైద్యాధికారి దుర్గాప్రసాద్ కు తెలియజేశాడు. వెంటనే స్పందించిన ఆయన ఘటనా స్థలానికి చేరుకొని వైద్యం అందించారు. విషం అప్పటికే శరీరమంతా పాకడంతో ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు రూ.60 వేలుగా ఉంటుందని ఆ రైతు చెప్పాడు. ఇన్నాళ్లూ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తన ఎద్దు మృతి చెందడంతో పర్వతాలు ముఖం హృదయ విదారకంగా మారింది. అతని బాధ వర్ణనాతీతం. ఆ పరిస్థితిని చూసి స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి. ఎలాగైనా ఆ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక నాయకులు, ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img