ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ వార్డు సభ్యుడు బుర్ర రాములు గౌడ్ అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందాడు. బుర్ర రాములు గౌడ్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యం పూర్తిగా క్షీణించడంతో నేటి ఉదయము మృతి చెందాడు. రాములు గౌడ్ మరణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేక మహేందర్ రెడ్డి తో పాటు మండలానికి చెందిన ప్రతినిధులు, మాజీ ప్రతినిధులతో పాటు పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధిలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు.
కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను బుర్ర రాములు గౌడ్ భౌతిక కాయంపై కప్పి నివాళులు అర్పించారు. బుర్ర రాములు గౌడ్ నిబద్ధతతో కూడిన వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకమైన కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా ఎన్నో సేవలు చేశాడని పేర్కొన్నారు. అంతే కాకుండా రెండు మార్లు వార్డు మెంబర్ గా గెలుపొంది ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడని అన్నారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేస్తూ జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం కృషిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. బుర్ర రాములు గౌడ్ మరణం తన కుటుంబానికే కాకుండా పార్టీకి కూడా తీవ్ర లోటు అని వెల్లడించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాములు గౌడ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. బుర్ర రాములు గౌడ్ మరణ వార్తను తెలుసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మిత్రులు, అభిమానులు తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు.