Bus : హైదరాబాద్ పరిధిలో అర్ధరాత్రి కూడా బస్సు (Bus) సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ”నైట్ రైడర్” సర్వీసులను అధికారులు నిలిపివేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ 50 శాతం సర్వీసులను తగ్గించింది. ఈ నేపథ్యంలోనే త్వరలో వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అర్ధరాత్రి అత్యవసర పనులకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ మూడేళ్ల క్రితం నైట్ రైడర్స్ పేరుతో బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. నగరంలోని కొన్ని కీలక ప్రాంతాలకు రాత్రి 10.30 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు బస్సులను నడుపుతుంది. ఈ ప్రత్యేక సేవ అసలు ఛార్జీ కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారికి ఈ సేవలలో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. ఈ సేవల ద్వారా కంపెనీకి పెద్దగా ఆదాయం రావడం లేదు. ఇటీవల ఈ సేవలు సగానికి సగం తగ్గిపోయాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొద్ది రోజుల్లోనే నైట్ రైడర్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని ఆర్టీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.