వెయ్యి అబద్దాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలంటారు పెద్దలు. కానీ ఓ వ్యక్తి దొంగతనం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు నమ్మకంగా ఉంటున్న యజమానికే కుచ్చుటోపి పెట్డాడు. యజమాని కారుతో పాటు రూ. 40 లక్షల డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అత్తాపూర్‌కు చెందిన వ్యాపారి వినయ్ కుమార్ గుప్తా వద్ద రాజస్థాన్‌కు చెందిన విజేంద్రసింగ్ గత కొంత కాలంగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విజేంద్రసింగ్ చాలా నమ్మకంగా పని చేసేవాడు. ఇటీవల వ్యాపారి కారులో డ్రైవర్‌తో కలిసి బంధువుల ఇంటికి బయల్దేరాడు. రూ.40 లక్షల నగదు ఉన్న సూట్‌కేసును కారు వెనక సీటులో ఉంచాడు. దాహం వేస్తుందని హైదర్‌గూడలోని ఓ దుకాణం వద్ద యజమాని కారును ఆపాడు. వాటర్ బాటిల్ కోసం యజమాని కిందకు దిగి షాపులోకి వెళ్లాడు. వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చేసరికి కారు కనిపించలేదు. డ్రైవర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. వ్యాపారి వినయ్ వెంటనే నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ దర్యాప్తు బృందాన్ని రాజస్థాన్‌కు పంపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు.
వ్యాపారి కారుతో పాటు, అతడు రూ.11లక్షలతో కొనుగోలు చేసిన కారు, రూ.20.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొమ్ములో రూ.3 లక్షలు తన స్నేహితుడికి అప్పుగా ఇచ్చినట్లు చెప్పారు. తాను పెళ్లి కోసమే దొంగతనం చేశానని నిందితుడు పోలీసుకు చెప్పాడు. ఖంగుతిన్న పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.