పశ్చిమ బెంగాల్‌లో 2016లో నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ సామ్యూల్ ఓ స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు.
రెండేళ్ల పాటు ఆ ఆపరేషన్ సాగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఆపరేషన్ జరిగింది.
అయితే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 13 మంది మంత్రులు, నేతలు.. లంచాలు తీసుకున్నట్లు నారద న్యూస్ ఆరోపించింది.
దానికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా అప్పట్లో రిలీజ్ చేశారు.
అప్పటికే శారద చిట్ ఫండ్ స్కామ్‌తో సతమతం అవుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వానికి నారద స్కామ్ మరో విఘాతంగాఎదురైంది.
నారద స్టింగ్ ఆపరేషన్ సమయంలో మాథ్యూ సామ్యూల్.. ఓ డొల్ల కంపెనీని సృష్టించాడు.
దానికి అనుమతులు ఇవ్వాలంటూ ఆయన టీఎంసీ మంత్రులను ఆశ్రయించారు.
అయితే తమకు లంచం ఇస్తేనే ఆ కంపెనీకి అనుమతులు ఇస్తామంటూ అప్పట్లో కొందరు మంత్రులు పేర్కొన్నారు.
ఆ నాటి నారద స్టింగ్ టేపుల్లో ఉన్నవారిలో ఫిర్‌హద్ హకీమ్, ముఖుల్ రాయ్, సౌగత్ రాయ్, కకోలీ ఘోష్ దస్తీదార్, సుల్తాన్ అహ్మద్, సుబ్రతా ముఖర్జీ, సువేందు అధికారి, సోవన్ చటర్జీ, అపురూప పోదార్, మదన్ మిత్ర, ఇక్బాల్ అహ్మద్, ప్రసూన్ బెనర్జీ, మీర్జాలు ఉన్నారు.
ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని 2017 మార్చి 17న కోల్‌కతా హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేసులో నిందితులైనవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశించింది.
అయితే ఆ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన కేసులో ఉన్న అందరిపై ఐపీసీ 120బీ ప్రకారం కేసు బుక్ చేశారు.
నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకు సంబంధించి ఇవాళ బెంగాల్‌లో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది.
కోల్‌కతాలోని నిజామ్ ప్యాలెస్‌లో ఉన్న సీబీఐ కార్యాలయానికి పలువురు మంత్రులు, నేతలు చేరుకున్నారు. వారంతా నారద స్టింగ్ ఆపరేషన్ విచారణ ఎదుర్కోనున్నారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఫిర్‌హద్ హకీమ్, కల్యాణ్ బెనర్జీ, షోవన్ ఛటర్జీ, ఎంపీ సంతను సేన్‌లు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
సీబీఐ తనను అరెస్టు చేసినట్ల మంత్రి హకీమ్ ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలను సీబీఐ ఖండించింది.