Homeఅంతర్జాతీయంCellphone, internet services shutdown in Australia ఆస్ట్రేలియాలో​ సెల్​ఫోన్, ఇంటర్నెట్ సేవలు...

Cellphone, internet services shutdown in Australia ఆస్ట్రేలియాలో​ సెల్​ఫోన్, ఇంటర్నెట్ సేవలు బంద్

– టెలికామ్ సంస్థ ఆప్టస్​లో సాంకేతిక సమస్య
– లక్షల మందికి నిలిచిపోయిన కమ్యూనికేషన్​

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఆస్ట్రేలియా టెలికామ్‌ దిగ్గజం ఆప్టస్‌లో తీవ్ర సాంకేతిక సమస్య ఎదురైంది. ఫలితంగా లక్షల మందికి ఇంటర్నెట్‌, మొబైల్‌ సర్వీసులు నిలిచిపోయాయి. ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద టెలికామ్‌ సంస్థ ఇదే. దీనికి దాదాపు కోటి మంది కస్టమర్లు ఉన్నారు. ఇక వందల సంఖ్యలో కంపెనీలతో ఇది వ్యాపారం చేస్తోంది. తాజాగా కమ్యూనికేషన్లలో ఇబ్బందులతో ట్రాన్స్‌పోర్ట్‌ రంగం, వైద్యశాలల్లో, చెల్లింపుల వ్యవస్థల్లో సమస్యలు మొదలయ్యాయి. ఈ సాంకేతిక సమస్యకు కారణం ఏంటనేది ఆప్టస్‌ వెల్లడించలేదు. సైబర్‌ దాడి అనడానికి ఆధారాలు ఏమీ లేవని పేర్కొంది. ఆప్టస్‌ నెట్‌వర్క్‌పై ఆధారపడిన ఇతర సర్వీసు ప్రొవైడర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిల్లో అమైసిమ్‌, ఆసీ బ్రాడ్‌బ్యాండ్‌, మూసే మొబైల్స్‌ వంటివి ఉన్నాయి. గతేడాది ఈ సంస్థకు చెందిన డేటా లీకైంది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అది అతిపెద్ద డేటా లీక్‌గా నిలిచింది. అప్పట్లో దీనికి సైబర్‌ దాడే కారణమని అనుమానించారు. తాజాగా ఆప్టస్‌లో సోమవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యను గుర్తించారు. దాదాపు ఏడుగంటల తర్వాత కంపెనీ సీఈవో కెల్లీ బాయర్‌ రోస్మరిన్‌ నుంచి తొలి అప్‌డేట్‌ వచ్చింది. సమస్య ఏమిటో అర్థం కావడంలేదని ఆయన వెల్లడించారు. ‘మా బృందాలు సమస్య పరిష్కరించడానికి విభిన్న కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. సర్వీసును బ్యాకప్‌ చేసేవరకూ మా బృందాలు అవిశ్రాంతగా పనిచేస్తాయి’అని కెల్లీ చెప్పారు. ఈ కమ్యూనికేషన్ల అంతరాయంతో దేశ వ్యాప్తంగా చాలా మంది అత్యవసర ఫోన్‌ కాల్స్‌ చేయడానికి అవస్థలు పడుతున్నారు. ఆస్ట్రేలియా కమ్యూనికేషన్‌ మంత్రి మిచెల్‌ రాల్యాండ్‌ మాట్లాడుతూ ‘ఈ సమస్యపై ఆస్ట్రేలియా వాసులు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికప్పుడు వారికి అప్‌డేట్లు ఇవ్వాలని కంపెనీని కోరుతున్నా ’అని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img