– గుట్కాకు సంబంధించిన యాడ్స్‌లో పాల్గొన్నారంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్
– ముగ్గురి నుంచి వివరణ కోరుతూ నోటీసులిచ్చిన కేంద్రం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: గుట్కా సంబంధిత కమర్షియల్ యాడ్స్‌లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు ముగ్గురు బాలీవుడ్ అగ్రనటులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ , అజయ్ దేవ్‌గణ్ ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారని అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు. అగ్ర నటులు కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ , అజయ్ దేవ్‌గణ్‌కు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. మరోవైపు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నారని న్యాయస్థానానికి పాండే తెలియజేశారు. అయినప్పటికీ.. ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని తెలిపారు. దీంతో అమితాబ్ సదరు కంపెనీకి లీగల్ నోటీసులు పంపారని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పాండే కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. వాదనలు విన్న కోర్టు.. దీనిపై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.