Homeఆంద్రప్రదేశ్​పిల్లి – పిల్లి కొట్టుకుంటుంటే.. బొక్కను కుక్క ఎత్తుకుపోయిందంట.. #AP #Telangana #WaterDispute #RiverWater

పిల్లి – పిల్లి కొట్టుకుంటుంటే.. బొక్కను కుక్క ఎత్తుకుపోయిందంట.. #AP #Telangana #WaterDispute #RiverWater

కృష్ణా నది జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఇటీవల తీవ్రస్థాయికి చేరుకుంది.

ఎన్జీటీ నుంచి సుప్రీంకోర్టు వరకూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఫిర్యాదులు చేసుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది.

దీంతో, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ అంశంపై జూలై 15 అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై కృష్ణా, గోదావరి నదీ జలాలపై పెత్తనం ఆ రెండు నదుల యాజమాన్య బోర్డులకు దక్కుతుందని తేల్చేసింది.

ఇకపై కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుల ద్వారా జరుగుతుందని స్పష్టం చేసింది.

ఇంతకీ కేంద్రం ఉత్తర్వుల్లో ఏముంది. రెండు ప్రభుత్వాలు ఏం ఆశించాయి. బోర్డులకు అధికారం కట్టబెట్టడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి అనేది చూడాల్సి ఉంది.

రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల కృష్ణా జలాల వినియోగం వివాదం తార స్థాయికి చేరింది.

కేంద్రానికి లేఖల నుంచి సుప్రీంకోర్టులో కేసుల వరకూ వెళ్లింది.

ఈ నేపథ్యంలో కేంద్రం ఏడేళ్ల నాటి ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.

జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ లో కీలకాంశాలు

 • కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి, గోదావరి పై నిర్మించిన 71 ప్రాజెక్టులు గోదావరి నదీ యాజమాన్య బోర్డు నియంత్రణలోకి వస్తాయి.
 • జూరాల నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వరకూ కృష్ణా రివర్ మేనేజ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. శ్రీశైలం లెఫ్ట్, రైట్ బ్రాంచ్ కెనాల్స్‌తో పాటు హెడ్ వర్క్స్, విద్యుత్ ప్రాజెక్టులు కూడా బోర్డు పరిధిలోకి వెళతాయి.
 • విభజన చట్టం 11వ షెడ్యూల్లో ఉన్న హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి, గాలేరు-నగరి, వెలిగొండ, నెట్టెంపాడు, తెలుగుగంగ కూడా బోర్డు పరిధిలోకి చేరుతాయి.
 • రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌తో పాటు డిండి, పాలమూరు-రంగారెడ్డి వంటి అనుమతుల్లేని ప్రాజెక్టులు కూడా బోర్డు పరిధిలోనే ఉంటాయి.
 • ఈ ఏడాది అక్టోబర్ 14నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. ఆయా బోర్డులకు ఇతర రాష్ట్రాల వారే చైర్మన్లు, సభ్య కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లుగా ఉంటారు.
 • అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ తక్షణం నిలిపివేసి, నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లోపు పూర్తి అనుమతులు పొందాలి.
 • కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు, సాంకేతిక అనుమతులు కూడా బోర్డు చేస్తుంది.
 • ప్రాజెక్టుల కోసం కేటాయించిన అన్ని పోస్టులు కూడా బోర్డుల పరిధిలోనే ఉంటాయి.
 • విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, యంత్రాలు, ఇతర సామగ్రి సహా అన్నీ బోర్డుల పరిధిలోకి వస్తాయి.
 • బోర్డు ఆదేశాలకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి చేసిన విద్యుత్ సరఫరా, పంపిణీని చూస్తాయి.
 • కార్యాలయాలు, నిర్వహణ సామాగ్రి, ఫర్నీచర్, వాహనాలు, ఆయా ప్రాజెక్టుల రికార్డులు, డాక్యుమెంట్లు కూడా బోర్డులకు చెందుతాయి.
 • నిర్వహణ కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల్లో బోర్డుకు చెరి రూ.200 కోట్లు చెల్లించాలి.
 • ఉమ్మడి ప్రాజెక్టులు, కాలువల వద్ద కేంద్ర బలగాలను నియమిస్తారు. వీటి నిర్వహణ బాధ్యతను బోర్డులే చూస్తాయి.
 • విపత్తులు, వరదలు, కరువులు ఏర్పడితే బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది.
 • ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అనుసరించాలి. బాధ్యతలు తీసుకోవాలి.
 • కృష్ణా జలాల ట్రిబ్యునల్ అవార్డ్ సహా ఇతర రాష్ట్రాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కూడా బోర్డులు చూస్తాయి.
 • ఆయా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం కూడా బోర్డులకు ఉంటుంది.
 • మొత్తం ప్రధాన మేజర్, మీడియం ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వస్తాయి.
 • రాష్ట్రాలు ఇక కేవలం మైనర్ ఇరిగేషన్ మాత్రమే చూడాల్సి ఉంటుంది.

స్వాగతించాల్సిన నిర్ణయం

మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిథులను నిర్ధేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ప్రతినిధి టి లక్ష్మీనారాయణ అన్నారు.

జలాశయాల దగ్గర రెండు రాష్ట్రాలు జుట్లు పట్టుకొనే దుస్థితి ఇక ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు.

“గెజిట్ నోటిఫికేషన్ లో తెలుగు గంగ, హంద్రీ -నీవా, గాలేరు – నగరి, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులను మాత్రమే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు.

వెలుగొండ ప్రాజెక్టును ఆమోదంలేని ప్రాజెక్టుల జాబితాలో ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం స్పందించి గజిట్ నోటిఫికేషన్‌కు సవరణ చేయించి, వెలుగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో పొందుపరచిన ప్రాజెక్టుల జాబితాలో ఉన్నట్లు ధ్రువీకరించాలి.

అప్పుడే సమస్య తీరుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త ప్రాజెక్టులకు అనుమతులు కష్టం కావచ్చు..

జలవివాదాల పరిష్కారానికి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి నిర్వహణ తీసుకురావడం కొంత ఫలితాన్నిచ్చినా, దీర్ఘకాలంలో కొత్త ప్రాజెక్టులకు ఇక అనుమతులు కష్టమమవుతుందని నీటిపారుదల రంగ పరిశీలకులు శివ రాచర్ల చెప్పారు.

“సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుని ఉంటే బాగుండేది. కానీ దానిని తీవ్రం చేశారు. ఫలితంగా కేంద్రం జోక్యం అనివార్యంగా మారింది.

ఇక నుంచి నిబంధనల ప్రకారం వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇరువైపులా మిగులు, వరద జలాల వినియోగంలో ఉన్న స్వేచ్ఛను కోల్పోతారు.

పైగా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం, వాటిని నిర్మించడం పెద్ద కష్టంగా మారబోతోంది.

పాలమూరు-రంగారెడ్డి, ఎస్ ఎల్ బీసీ పూర్తిచేయడం , రాయలసీమ లిఫ్ట్ పనులు ముందుకు సాగడం కూడా సమస్యే కావచ్చు.

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో రాబోయే రోజుల్లోనైనా వృధా అరికట్టి సద్వినియోగం కోసం చర్యలు తీసుకుంటే ఉభయ రాష్ట్రాలకు మేలు జరుగుతుంది” అని అన్నారు.

కొన్ని మార్పులు చేయాలంటున్న ఏపీ ప్రభుత్వం

విభజన చట్టం ప్రకారం నదీ యాజమాన్య బోర్డుల పరిధి నిర్ణయించడంలో ఎట్టకేలకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఏపీ నీటిపారుదలశాఖ ప్రకటించింది.

అయితే, అందులో బేసిన్‌కి అవతల, ఉమ్మడి పరిధిలోని లేని ప్రాజెక్టుల విషయంలో మార్పులు చేయాలని బీబీసీతో మాట్లాడిన ఇంజనీర్ ఇన్ చీఫ్‌ నారాయణ రెడ్డి కోరారు.

“విభజన చట్టం ప్రకారం ఆరు నెలల్లో ఆయా నదీ యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి జ్యూరిస్‌డిక్షన్ నిర్ణయించాలి.

కానీ జాప్యం జరిగింది. ఈలోగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ప్రోటోకాల్ ప్రకారం ఇరు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాం.

ఈ ఏడాది తెలంగాణా ప్రభుత్వం దానిని ఉల్లంఘించింది. గడిచిన 45 రోజుల్లో 30 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేసింది.

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 30.2 టీఎంసీల ఇన్ ఫ్లో ఉంటే తెలంగాణా 29 టీఎంసీలకు పైగా నీటిని వాడేసింది.

దానివల్ల నీటిమట్టం పెరగలేదు. ఫలితంగా రాయలసీమ కు నీటిని తరలించే అవకాశం ఇంకా రాకుండా పోయింది.

ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశాం. సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశాం. ఫలితంగా తాజాగా నోటిఫై చేశారు” అని వివరించారు,

“ఉభయ రాష్ట్రాలకు సంబంధం లేని కొన్ని ప్రాజెక్టులను కూడా బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చారు.

అందులో ధవళేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ వంటివి ఉన్నాయి. వాటిని తొలగించాలి.

దాంతో పాటుగా వెలిగొండ విషయంలో అనుమతులున్న ప్రాజెక్ట్. అయినా తాజా గెజిట్ నోటిఫికేషన్‌లో భిన్నంగా వచ్చింది. ఇలాంటి మరికొన్ని మార్పులు అవసరమని కోరుతాం” అన్నారు.

దీనిపై, తెలంగాణా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు.

నదీ యాజమాన్య బోర్డుల చరిత్ర

విభజన తర్వాత నీటి వనరుల వినియోగం కోసం అపెక్స్ కౌన్సిల్ ను చేశారు. అపెక్స్ కౌన్సిల్‌కి కేంద్ర జలశక్తి మంత్రిగా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు.

అపెక్స్ కౌన్సిల్ తీసుకొనే నిర్ణయాలను అమలు చేయడం కోసమే కృష్ణా, గోదావరి నదులకు విడివిడిగా యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేశారు.

అపెక్స్ కౌన్సిల్, యాజమాన్య బోర్డులకు నదీ జలాలను పంపిణీ చేసే అధికారం లేదు.

నదీ జలాల పంపిణీ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956 కి అనుగుణంగా కేంద్రం నియమించే ట్రిబ్యునల్స్ ద్వారా జరుగుతాయి.

బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయానికి అనుగుణంగా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన కేటాయింపుల మేరకు తెలుగు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలి.

ఆ ప్రాతిపదికనే కృష్ణా నదీ జలాల్లో 811 టియంసీలు ఉమ్మడి ఆంధ్రకు కేటాయిస్తే, ప్రస్తుతం ఏపీ 512 టియంసిలు, తెలంగాణ 299 టియంసిల చొప్పున వాడుకోవాలని అపెక్స్ కౌన్సిల్‌లో నిర్ణయించారు.

ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత అపెక్స్ కౌన్సిల్‌దే.

యాజమాన్య బోర్డుల ద్వారా ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. అందుకే విభజన చట్టం మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img