- ప్రధాన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్
- ఆర్జీ కార్ ప్రిన్సిపల్‌తో పాటు మరో నలుగురికి..
- ర్యాలీలో పాల్గొన్న స్కూళ్లకు సర్కార్ షో కాజ్ నోటీసులు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనలు తెలిపిన మూడు స్కూళ్లకు బెంగాల్ సర్కార్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలలో మూడు విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారని విద్యా శాఖ చర్యలు చేపట్టింది. హౌరా జిల్లాలోని బలుహతి సెకండరీ స్కూల్, బలుహతి గర్ల్స్ సెకండరీ స్కూల్, బంట్ర రాజలక్ష్మి గర్ల్స్ స్కూళ్లకు నోటీసులు పంపింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయా స్కూళ్లను ఆదేశించింది. విద్యార్థులతో పాటు పలువురు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొన్నారని.. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరగతుల సమయంలో విద్యార్థులు ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విద్యార్థులను ర్యాలీకి తీసుకెళ్లినట్లు తమకు తెలిసిందని విద్యాశాఖ తెలిపింది.
నిందితులకు లై డిటెక్టర్ టెస్ట్…
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో ఆరుగురికి శనివారం లై డిటెక్టర్ టెస్టులు ప్రారంభించింది. నిందితుడు సంజయ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉండగా అక్కడే లై డిటెక్టర్ పరీక్ష చేపట్టారు. ఈ కేసులో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, బాధితురాలిపై హత్యాచార ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు డాక్టర్లు, మరో సివిల్ వాలంటీర్‌కు కూడా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం కోల్‌కతా చేరుకుంది.