Homeహైదరాబాద్latest Newsహుజురాబాద్ గడ్డపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సవాళ్ల పర్వం.. అసలు ఏం జరిగిందంటే..?

హుజురాబాద్ గడ్డపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సవాళ్ల పర్వం.. అసలు ఏం జరిగిందంటే..?

ఇదే నిజం, వీణవంక: హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో హుజూరాబాద్ రాజకీయాలు రంజు మీద ఉన్నాయి. ఈ వివాదంలోకి తాజాగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్ ప్రవేశంతో మరింత హీటెక్కాయి. గత ప్రభుత్వ హయాంలో ఇసుక రవాణాలో కౌశిక్ రెడ్డి అవకతవకలకి పాల్పడ్డాడని, రైస్ మిల్లర్ల నుండి కోట్లలో వసూళ్ళు పిండుకున్నారని ప్రణవ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలకి ప్రతిగా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయడానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీణవంకలోని తన స్వగృహం నుండి బయలుదేరగా పోలీసులు అడ్డగించి ఆయనని హౌస్ అరెస్ట్ చేసారు. హనుమాన్ ఆలయం వధ్ధ 144 సెక్షన్ అమలులో ఉండడంతో అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదని వారు వివరించడంతో ఎమ్మెల్యే కౌశిక్ తన స్వగృహంలోనే తడి బట్టలతో ఆంజనేయ స్వామి చిత్రపటం సాక్షిగా ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చర్యకి పాల్పడలేదని వందలాది మంది అనుచరుల సమక్షంలో, మీడియా ఎదుట ప్రమాణం చేసారు. ఒకవేళ మంత్రి పొన్నం ప్రభాకర్ గనుక ఎన్టీపీసీ బూడిద విషయంలో ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే రేపు ఉదయం 11.00 గంటలకి హైదరాబాద్ లోని అపోలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తనలాగే తడి బట్టలతో ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

Recent

- Advertisment -spot_img