Homeహైదరాబాద్latest Newsవసూళ్ళ ప్లానింగ్ కు కేరాఫ్ చందానగర్ సర్కిల్.. వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు..!

వసూళ్ళ ప్లానింగ్ కు కేరాఫ్ చందానగర్ సర్కిల్.. వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు..!

అయ్యప్ప సొసైటీలో అమాత్యుల పేరుతో  కోట్లాది రూపాయల వసూళ్లు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిజోన్  చందానగర్ సర్కిల్ 21  టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం అన్నది కేవలం పట్టణాన్ని ప్రణాళికా ప్రకారం నిర్మించాలని నిర్దేశిస్తున్నది . కానీ అందుకు విరుద్ధంగా  అధికారులు మాత్రం తమ ఆస్తులను ఎలా పెంచుకోవాలని ప్రణాలికలు  రచిస్తూ ప్రణాళిక విభాగాన్ని అపహస్యంపాలు చేస్తున్నారు. కంచే చేను మేసే చందంగా అధికారులు వ్యవహరించడంతో ఆ విభాగాన్ని గాడిలో పెట్టేవారెవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, సర్కిల్ డీసి ,ఏసీపీ మారినప్పుడు ఒకటి రెండు అక్రమ నిర్మాణాలను కూల్చి హెచ్చరికలు పంపుతున్నారు. ఆ తర్వాత షరామామూలే అన్నచందంగా అక్రమ వసూళ్ల  దందాను షురూ చేస్తున్నారు.చందానగర్  సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్11/8 నుంచి 11/32 వరకు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చంద్రానాయక్ తండాలలో గురుకుల్ ట్రస్ట్ భూములు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వీటికి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి వీలు లేదు. అయితే కొందరు చందానగర్ సర్కిల్, శేరిలింగంపల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మ్యానేజ్ చేసుకొని  5,6  ఫ్లోర్లతో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్న భారీ బిల్డింగులకు ప్లానింగ్ విభాగం  సిబ్బంది 3లక్షల నుంచి రూ.4లక్షలు  దండుకుంటున్నట్లు బహిరంగంగా
చెప్పుకుంటున్నారు.ఈ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది అయిన చైన్ మెన్లు ఆడిందే ఆట పాట పాడిందే పాటగా తయారయింది. కొంత మంది బిల్డర్లతో జత కట్టి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు.

చందానగర్ సర్కిల్ లో ఒకే ఒక్కడు..
చందానగర్ సర్కిల్ లో అతనో మామూలు ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్.కానీ అతను జీహెచ్ఎంసి కేంద్ర స్థాయి కార్యాలయం వరకు శాసించే స్థాయికి చేరుకున్నాడంటే అతిశయోక్తి.కాదు. గత 15 ఏండ్లుగా ఒకే సర్కిల్ లో ఉంటూ  టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తాన్ని  శాసిస్తున్నాడు. ఆయన చెప్పినట్లే అధికారులు నడుచుకోవాలో లేదంటే వారిపై బదిలీవేటు పడటం ఖాయం.  అందుకు విరుద్ధంగా ఏండ్లుగా పాతుకుపోయిన అతనికి ట్రాన్స్ ఫర్ అనేది మాత్రం  ఎరగడు .కోట్ల రూపాయలకు పడగలెత్తిన సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకవేళ ట్రాన్స్ ఫర్ అయినా క్షణాల్లో తిరిగి యధా స్థానంలో ఉంటాడు.   ఇటీవల ఓ జోనల్ కమిషనర్ పక్క సర్కిల్ కు ట్రాన్స్ ఫర్ చేస్తే వెంటనే తిరిగి మళ్లీ తానున్న చోటుకే మళ్ళీ రావడం గమనార్హం. సర్కిల్ కొత్తగా వచ్చిన వారు తాను చెప్పినట్టు నడుచుకోకపోతే ఉన్నతస్థాయి అధికారులకు  సైతం స్థానచలనం  అయ్యేలా  వెనక ఉండి చక్రం తిప్పుతాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ బదిలీపై రాగా బాధ్యతల చార్జీ తీసుకోకుండా  అడ్డుకోవడం చూస్తుంటే ఆయన హవా సర్కల్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా  ఆయన  గీసిన చట్రంలోనే సర్కిల్ నడుచుకుంటున్నట్లు తేటతెల్లం అవుతున్నది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో బిల్డింగు కట్టాలంటే సదరు ఉద్యోగి చెప్పిందే వేదం. ఆయన ట్యాక్స్ కట్టాల్సిందే లేదంటే ఆయనే దగ్గరుండి కూల్చి వేయిస్తాడు. ఇటీవల అయ్యప్ప సొసైటీ లో హైడ్రా రాకుండా చూసుకుంటామని  అమాత్యులకు ముట్ట చెప్పాలని  కోట్లాది రూపాయల వసూలు చేసిన వ్యవహారంలో  ఈయన కీ రోల్ ప్లే చేసినట్లు కొందరు బాధితులు బహిరంగంగా చెప్పడం  గమనార్హం.

నూతన జడ్సి వచ్చినా.. తీరు మారని శేరిలింగంపల్లి జోన్..
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కొన్ని అక్రమ నిర్మాణాలను ఇటీవల చందానగర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూల్చారు. అయితే అవన్నీ సింగిల్ ఫ్లోర్, పిల్లర్ల దశలో ఉన్న నిర్మాణాలే కావడం గమనార్హం. అయితే అయ్యప్ప సొసైటీ, సర్వే అఫ్ ఇండియా, చంద్రనాయక్ తండా ఏరియాల్లో ఐదారు ఫ్లోర్లతో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు వాటి జోలికిపోవడం విమర్శలకు తావిస్తోంది.  దీంతో  కొత్తగా వచ్చిన జెడ్సి తన ఉనికిని చాటుకోవడంతో అక్రమ నిర్మాణ దారులను దారికి తెచ్చుకొనేందుకు  వచ్చి రాగానే హడావుడి చేశారని  ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైగా  కిందిస్థాయి సిబ్బందిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా వెనకేసుకు రావడం వెనుక ఏదో మతలాబు ఉందని ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img