రాజమహేంద్రవరం : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు ప్రధాన పార్టీల అగ్రనాయకులు రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి పాల్గొంటారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం పర్యటిస్తారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు అంబాజీపేట, రాత్రి 7 గంటలకు అమలాపురంలో నిర్వహించే బహిరంగ సభల్లో ఇరుపార్టీల నేతలు ప్రసంగిస్తారు.