ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారు అని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమే. చంద్రబాబుగారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుంది అని అన్నారు.
1998లో కూడా చంద్రబాబు గారు విజన్-2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబుగారు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు అని అన్నారు.
ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్-2020 కాదు, “420’’ అంటూ చంద్రబాబును దుయ్యపట్టారు. 2014లోకూడా చంద్రబాబుగారు విజన్-2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది.
తన పరిపాలనలో మొత్తం ౩ విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క పోర్టుకాని, ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? స్కూళ్లు బాగుచేశాడా? ఆస్పత్రులు బాగు చేశాడా? వ్యవసాయరంగాన్ని బాగుచేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవవనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తుమీద ఒక్కపైసా అయినా ఖర్చుచేశాడా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు.
ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్-2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్ కాదా? ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకుడ్ని చీటర్ అంటారు కాని, విజనరీ అంటారా? అని జగన్ ప్రశ్నించారు.