- కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల ప్రారంభం
ఇదేనిజం, కరీంనగర్ ఎడ్యుకేషన్:వామపక్ష విద్యార్థి నాయకులతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యను అర్జిస్తూనే హేతుబద్దతతో ఆలోచించి, పాలనను ప్రతిబింబించే సమాజంపై తిరుగుబాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేటి సాంబశివరావు పిలుపునిచ్చారు. కరీంనగర్లో మంగళవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక, సైద్దాంతిక రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఏఐఎస్ఎఫ్ జెండాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి విద్యను కార్పోరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి జాతీయ విద్యావిధానం తీసుకొచ్చి విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయన్నారు.
నీట్ పరీక్షలో పేవర్ లీక్ అవతకవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు జరుగుతున్న నేపధ్యాన్ని మరువకముందే దేశవ్యాప్తంగా నిర్వహించిన యుజిసి నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విధ్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్, యుజిన్- ఎన్ఏటి పరీక్షలో జరిగిన అవతవకలపై సుప్రీం కోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, తక్షణమే అందుకు బాధ్యులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ 7 వేల కోట్ల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు టిసిలు ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుత్వమే ప్రైవేట్ కళాశాలలకు బాధ్యత వహించాలన్నారు. పరిపాలనకు, సమాజానికి సంబంధం లేకుండా దేశంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందన్నారు. కారుచీకటిలో కాంతిరేఖలో వెలుగులు నించడమే కమ్యూనిస్టుల ఆలోచన విధానమన్నారు. చేగువేరా, భగత్ సింగ్ విప్లవవీరులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒక్క సిరాచుక్క లక్షల మెదడులను ప్రభావితం చేయగలుగుతుందని, జిల్లాలో ఏఐఎస్ఎఫ్ నిర్మాణాత్మక కమిటీలు బలోపేతం చేసి సమాజ మార్పుకు కృషి చేయాలన్నారు.
ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత 50 సంవత్సరాల అనుభవంలో విద్య కాషాయీకరణ, శాస్త్రీయ విద్యావిధానం అమలు జరగడం లేదని వాపోయారు. విద్యనందించే ఉపాధ్యాయులకే ఉత్తమ శిక్షణ ద్వారానే మార్పు సాధ్యమవుతుందన్నారు. నాణ్యమైన విద్య అందడం లేదని, కేవలం సర్టిఫికెట్లు సాధిస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొయ్యాడ సృజన్ కుమార్, మాజీ రాష్ట్ర నాయకులు మంద పవన్, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకుడు మహేందర్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రఘురాం, సోతుకు ప్రవీణ్, రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, జనార్ధన్, అంజి, సంతోష్, వెంకటేష్, శరత్ తదితరులు పాల్గొన్నారు.