Homeఅంతర్జాతీయం#Corona : చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టింది

#Corona : చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టింది

‘కోవిడ్-19 చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టింది’

కరోనా మొదలైనప్పటి నుంచి ఉన్న ఆరోపణ ఇది.

కానీ ఈ దీన్ని చైనా ఖండిస్తూ వస్తోంది. ఇదొక కుట్ర సిద్ధాంతమని చెబుతోంది.

ల్యాబ్‌లోనే కోవిడ్ పుట్టిందనడానికి ఆధారాలు చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గత మార్చిలో పేర్కొంది.

డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం వూహాన్‌లో పర్యటించి ఈ నివేదిక ఇచ్చింది.

అయితే, ల్యాబ్‌లోనే కోవిడ్ పుట్టిందనే ఆరోపణలను కొట్టి పారేయలేమని అమెరికా ఇప్పుడు భావిస్తోంది.

కోవిడ్-19 మూలాలు కనిపెట్టే ప్రయత్నాలను వేగవంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించారు.

కరోనా పుట్టుక మీద తనకు సరైన నివేదికలు అందలేదన్న బైడెన్, దీనిపై పరిశోధనకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందా లేక ల్యాబ్‌లో జరిగిన ప్రమాదం వల్ల కోవిడ్ పుట్టిందా అనేది తేల్చాలని బైడెన్ ఆదేశించారు.

చాలా ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతున్నాయని కానీ ఇందులో దేనికి ఎక్కువ అవకాశముందో మాత్రం తేల్చలేక పోతున్నాయని అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు.

సమగ్రమైన, పారదర్శకమైన దర్యాప్తునకు సహకరించేందుకు ప్రపంచ దేశాలతో కలిసి చైనాపై ఒత్తిడి తెస్తామని కూడా ఆయన వెల్లడించారు.

అయితే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం కలిగించాయి.

వాస్తవాలను, సైన్స్ ఆధారంగా జరిపిన పరిశోధన ఫలితాలను వాషింగ్టన్ నమ్మడం లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియన్ విమర్శించారు.

”అమెరికా లక్ష్యం ఇతరుల మీద ఆరోపణలు చేయడం, బురద చల్లడం. ఈ వైఖరితో వారు శాస్త్ర పరిశోధనలను కూడా అవమానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.’ అని అన్నారు లీజియన్.

ఇంతకీ వూహాన్ ల్యాబ్ సిద్ధాంతం ఏం చెబుతోంది?

కుట్ర సిద్ధాంతం నుంచి కొట్టి పారేయలేని ఊహాగానం వరకు…

ప్రపంచంలో తొలి కరోనా కేసు బయటపడ్డ ప్రదేశంగా వూహాన్‌ నగరానికి పేరుంది.

చైనాలోని ప్రముఖ పరిశోధనాశాలల్లో ఒకటైన వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోనే ఈ వైరస్ పుట్టిందని గత ఏడాది నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి.

అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దీనిని విస్తృతంగా ప్రచారం చేశారు.

వూహాన్‌లో బయో సెక్యురిటీ గురించి తాము ఆందోళన చెందుతున్నట్లు 2020 ఏప్రిల్‌లో అమెరికా అధికారులు పంపిన నివేదికలతో ఈ అనుమానాలకు బీజం పడింది.

ఈ ఆరోపణలను చైనా తిరస్కరించినా, అక్కడ విచారణ జరపడానికి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు సాధ్యం కాలేదు.

ఈ ఏడాది ఆరంభంలో డబ్ల్యూహెచ్ఓ పంపిన పరిశోధకుల బృందం చైనా శాస్త్రవేత్తలతో కలిసి ఒక నివేదికను తయారు చేసింది.

అయితే ఈ వైరస్ ఎక్కడ పుట్టిందనే విషయంలో మాత్రం ఈ నిపుణుల బృందం కచ్చితమైన నిర్ధరణకు రాలేదు.

ఇది లేబరేటరీలోనే పుట్టింది అనడానికి ఆధారాలు లేవని, మూలాలు కనుగొనడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని మాత్రం దర్యాప్తు బృందం చెప్పింది.

అయితే, విచారణలో ఆలస్యం, బీజింగ్ విధించిన పరిమితులతో ఈ నివేదికపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ మార్పుకు కారణమేంటి?

కరోనావైరస్‌ వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనేది కుట్ర సిద్ధాంతం నుంచి ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అన్న అనుమానంగా మారడానికి అనేక అంశాలు తోడ్పడ్డాయి.

కరోనావైరస్‌ వూహాన్‌లోని ప్రయోగశాల నుంచి, అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న హునన్ ప్రాంతంలోని వెట్ మార్కెట్‌ (చేపలు, సముద్ర జీవులు, మాంసం అమ్మే మార్కెట్)కు వ్యాపించి ఉండవచ్చని కొందరు నిపుణులు అనుమానిస్తున్నారు.

హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫోర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన 18మంది శాస్త్రవేత్తల బృందం రాసిన ఒక లేఖను ‘సైన్స్’ జర్నల్‌ మే 14న ప్రచురించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఫలితాలను ఈ శాస్త్రవేత్తల బృందం ప్రశ్నించింది.

వైరస్ మూలాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఈ శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేశారు.

గత ఆదివారం అమెరికా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఒక కథనం ప్రచురించింది.

దాని ప్రకారం 2019 నవంబర్‌లో వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన ముగ్గురు పరిశోధకులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

చైనాలో మొదటి కరోనా కేసు బయట పడటానికి చాలా వారాల ముందే కొందరు పరిశోధకులలో ఈ వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలైందని ఈ కథనం పేర్కొంది.

ఈ ప్రయోగశాల హునాన్‌ ప్రావిన్స్‌లోని వెట్‌ మార్కెట్‌‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

లేబరేటరీలోనే వైరస్ పుట్టిందని నమ్మే చాలామంది.. వైరస్ ఈ ల్యాబ్ నుంచి మార్కెట్‌కు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఆంథోనీ ఫౌచీ ఏమన్నారు?

ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకి ఉండవచ్చని గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు..అమెరికా వైద్య సలహాదారు ఆంథోని ఫౌచి.

అయితే, గత సోమవారం అందుకు భిన్నమైన ప్రకటన చేశారు.

ఈ వైరస్ సహజంగా పుట్టిందంటే తాను నమ్మలేనని చెప్పారు.

” చైనాలో ఏం జరిగిందో దర్యాప్తు జరగాలని నేను భావిస్తున్నాను” అని ఆంథోనీ ఫౌచి అన్నారు.

వైరస్‌ వ్యవహారంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ మరో కథనాన్ని ప్రచురించింది.

2012లో యునాన్ ప్రావిన్స్‌లోని ఒక గనిలో గబ్బిలాల మలం శుభ్రపరిచేందుకు వెళ్లిన ఆరుగురు కార్మికులు అనారోగ్యానికి గురయ్యారని వారిలో ముగ్గురు మరణించారని పేర్కొంది.

ఆ సమయంలో వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణులు ఆ ప్రాంతాన్ని పరిశోధించడానికి వెళ్లారు. అక్కడి గబ్బిలాల మలం నమూనాలు సేకరించి, అందులో అనేక కొత్త రకాల వైరస్‌లను గుర్తించారు.

అయితే, ల్యాబ్‌ నుంచే కరోనావైరస్‌ ఉద్భవించిందని చెప్పడానికి ఈ అంశాలు సరిపడకపోవచ్చు.

కానీ కోవిడ్ సహజంగా పుట్టలేదని, మనిషి చేసిన పనుల వల్లే కోవిడ్ పుట్టిందని చెప్పే సందేశాలను డిలీట్ చేయడం ఆపేస్తామని ఫేస్‌బుక్‌ ప్రకటించడానికి మాత్రం ప్రస్తుతానికి సరిపోయాయి.

Recent

- Advertisment -spot_img