Warangal : హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వరంగల్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం రాసాభాసగా మారింది. పరకాల శివారులోని కామరెడ్డిపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితర నాయకులు హాజరయ్యారు.
తమకు తెలియకుండా ఇటీవల పలు మండలాలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై మంత్రి కొండా సురేఖ వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. మంత్రి లేకుండానే సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యమివ్వడం లేదంటూ ఆ వర్గానికి చెందిన ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ గజ్జి విష్ణు గొడవకు దిగారు. కొండా దంపతుల నేతృత్వంలో పనిచేసి హస్తం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వేదికపై ముఖ్యనేతలు ఉండగానే ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే గజ్జి విష్ణు, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విష్ణు వర్గీయులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సీఐ రవిరాజు వారికి నచ్చజెప్పి విష్ణును బయటకు తీసుకురావడంతో అందరూ కలిసి సమావేశ మందిరానికి చేరుకున్నారు. గజ్జి విష్ణును, ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ప్రకటించారు.