ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి కానుకను ప్రకటించారు. సీఎం మరో సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తాము అధికారంలోకి వస్తే దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు. ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ కార్యక్రమంపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర చమురు కంపెనీల ప్రతినిధులతో సియం సమీక్షించారు.