– తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష
ఇదే నిజం, ఏపీ బ్యూరో: తుఫాన్ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంవో అధికారులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. నెల్లూరు, తిరుపతి సహా తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. తుఫాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలి. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలి’ అని అధికారులకు సీఎం జగన్ సూచించారు.