CM KCR:అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతులను సైతం ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లో పంటలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10వేలు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదలకు సంబంధించిన జీవో జారీ చేసిందన్నారు. పంట నష్టం దెబ్బతిందని రైతులు నారాజ్ కావొద్దని సూచించారు.‘రాష్ట్ర జీడీపీ పెరుగుతున్నది. ప్రజలకు పని దొరకుతుంది. పల్లెలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితిని వెనక్కి పోనివ్వొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోవద్దు. మీ వెంట కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటుంది. రైతులు ఆత్మస్తయిర్యం దెబ్బతీసుకోకుండా నిలబడి ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంలో తట్టుకోవాలి తప్పా.. మనసు చిన్నబుచ్చుకొని నారాజ్ కావొద్దు. ఇంకా బలంగా పని చేస్తూ ముందుకుపోవాలి. పంట సాయానికి సంబంధించి సీఎస్ జీవో సైతం జారీ చేశారు. త్వరలోనే రైతులందరికీ డబ్బులు వస్తాయ్. అక్కడక్కడ కౌలు రైతులు సైతం ఉన్నరు. వారు కూడా మొత్తం మునిగిపోతరు కాబట్టి వారిని సమన్వయం చేసి వారికి సహాయం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. సీఎస్ ఆదేశాలు జారీ చేస్తారు.