చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేసీఆర్
హైదరాబాద్ః తెలంగాణలో అవినీత అంతానికి నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కొత్త రెవెన్యూ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. పేదలు ఎంతోకాలంగా అనుభవిస్తున్న బాధలకు ఈ చట్టంతో ముగింపు లభిస్తుందని, ఇది చారిత్రక ఘట్టం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఈ కొత్త చట్టం వర్తిస్తుందని తెలిపారు. భూమికి సంబంధించిన సమస్యలు ఎప్పుడూ జఠిలంగా ఉన్నాయని, గత పాలకులు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని సీఎం అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే కొత్త సంస్కరణలతో కూడిన చట్టాన్ని రూపొందించామని సభలో సీఎం వివరించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై టాస్క్ ఫోర్స్ కమిటీ
ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కొన్ని ఆసుపత్రులు కరోనా ట్రీట్మెంట్ పేరిట డబ్బు సంపాదించుకుంటున్నాయని మండిపడ్డారు. దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనూ ఇలా పీడించడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ఇచ్చిన సలహా మేరకు టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తామని సభలో ప్రకటించారు. ఆరోగ్యమంత్రి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఉంటుందని, వారానికి ఓసారి రిపోర్ట్ అన్ని పార్టీలకు అందేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తప్పుపట్టిన కేసీఆర్
కరోనాపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రభుత్వంపై అక్బర్ వ్యాఖ్యలు కొంత చర్చకు దారితీశాయి. కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తు చేయకపోవడం దారుణమన్నారు. మంత్రి ఈటల ప్రసంగం హెల్త్ బులెటిన్‌లా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ నిధికి విరాళాలు ఇచ్చినవారిని గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా అనేక రంగాలపై ప్రభావం చూపిందని, దీన్ని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొనలేదని అక్బర్ గుర్తు చేశారు. అక్బర్ చేసిన విమర్శలను సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. కరోనా నియంత్రణకు మంత్రి ఈటల ఆహర్నిషలు కృషి చేశారని ఈ సందర్భంగా సీఎం అన్నారు. కరోనా యోధులకు వేతనాలు పెంచి ఇస్తున్నామన్నామని గుర్తుచేశారు. ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ప్రజలకు తప్పిందన్నారు. ఈసీ వివరాలు కూడా ధరణి పోర్టల్‌లో ఉంటాయన్నారు. ధరణి పోర్టల్‌లో పంచాయితీ, పురపాలిక, నగరపాలిక.. జీహెచ్ఎంసీ ఆస్తుల వివరాలు కూడా పొందుపరిచామన్నారు.