CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల టూర్ ప్లాన్ ఇలా..
CM KCR : దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటన పది రోజుల పాటు ఆరు రాష్ట్రాల్లో సాగనున్నట్లు తెలుస్తోంది.
ఈ పర్యటనలో జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు.
పలువురు సీఎంలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీయేతర నేతలతో భేటీలతో కేసీఆర్ బిజీబిజీగా గడపనున్నారు.
శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలోని పలు రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులతో భేటీకానున్నారు.
ఈ భేటీల్లో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై ప్రముఖులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ఆదివారం కేసీఆర్ చండీగఢ్ వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ఆరు వందల రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తారు.
రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు.
ఈ చెక్కులను ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి అందించనున్నారు. 26న సీఎం కేసీఆర్ బెంగుళూరులో పర్యటిస్తారు.
మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అవుతారు. 27న కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు.
రాలేగావ్ సిద్ధిలో అన్నహజారేతో భేటీ అవుతారు. మే 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్ లో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతుంది.
అ క్రమంలో గాల్వన్ వ్యాలీలో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. సైనిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
సీఎం కేసీఆర్ పర్యటనపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆయా రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగడతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మీడియా రంగాల్లోని ప్రముఖులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
అయితే దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ చెప్పిన తరువాత పలు సార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీయేతర సీఎంలు, బీజేపీ, కాంగ్రెసేతర రాజకీయ ప్రముఖలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
అయితే గతంలో రెండుమూడు రోజుల మాత్రమే పర్యటన సాగింది. ఈసారి సీఎం కేసీఆర్ ఏకంగా పదిరోజుల పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించనుండటం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.