హైదరాబాద్: సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగని, ఈ కొత్త చట్టం అంతం కాదని.. ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా ఈ బిల్లులో దృష్టి సారించామన్నారు. బిల్లుపై ఇతర సభ్యులు ఇచ్చిన సభ్యులను స్వీకరిస్తామని చెప్పారు. ఆర్వోఎఫ్‌ఆర్ (రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) భూములను పరిరక్షిస్తామని చెప్పారు. ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల్లో ఆర్వోఎఫ్‌ఆర్ కింద ఇచ్చిన పత్రాలు పట్టా సర్టిఫికెట్లు కావని.. ప్రజలు ఆ భ్రమల్లో ఉండొద్దన్నారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్‌గా ధరిణి పోర్టల్‌ను రూపొందించామన్నారు. ధరణి పోర్టల్‌లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్ కేటాయించామన్నారు. ఈ పోర్టల్‌ను రెవెన్యూ శాఖే నిర్వహిస్తుందని తెలిపారు.
ఆక్రమణల్లో 1.47 లక్షల ఎకరాల భూమి
రాష్ట్రంలో 1.47 లక్షల ఎకరాల భూమి ఆక్రమణల్లో ఉందన్నారు. ఇందులో 87వేల ఎకరాల దేవాదాయ భూములు, 55వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. వక్ఫ్, దేవాదాయ భూములను రక్షిస్తామన్నారు. రేపటి నుంచి వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో పాటు గ్రామపంచాయతీ, పురపాలికల్లో అనుమతులను నిలివేస్తున్నట్లు స్పష్టం చేశారు. భూములు పంపిణీ చేస్తామని అసత్యాలు చెప్పబోమని.. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమే లేదని సీఎం తేల్చిచెప్పారు. భూముల క్రమబద్ధీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామన్నారు. కౌలు దారీ వ్యవస్థను పట్టించుకోమన్నారు.
భూముల గొడవలు తక్కవే
రాష్ట్రంలో 57.90 లక్షల మంది రైతులకు చెందిన కోటి 48లక్షల 57 వేల ఎకరాల భూమికి రైతుబంధు అందించామని కేసీఆర్ తెలిపారు. కేవలం 48 గంటల్లో రూ.7,200 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబంధు ప్రకారం వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువన్నారు. భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర సర్వే సరైన మార్గమని.. వీలైనంత త్వరగా దీన్ని నిర్వహిస్తామని తెలిపారు.
రెండు రకాల పాస్‌బుక్‌లు
వ్యవసాయ భూమికి ఆకు పచ్చ, వ్యవసాయేతర భూమికి ముదురు ఎరుపు రంగు పాస్‌బుక్ పంపిణీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచన మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకూ రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏ రకమైన రిజిస్ట్రేషన్ అయినా వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ప్రకారం జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
సాధ్యమైనంత త్వరగా సమగ్ర భూసర్వే: కేసీఆర్
RELATED ARTICLES