తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుదిదశకు చేరిందని తెలుస్తుంది. అయితే గ్రామాల్లో ఎటుచూసినా గ్రామపంచాయతీ ఎన్నికలపైనే చర్చ నడుస్తోంది. గ్రామాల్లోని లీడర్లు అందరూ సర్పంచ్ ఎన్నికల కోసమే ఎదురుచూస్తున్నారు.అయితే హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్, తదితరులు పాల్గొననున్నారు. కాగా ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టు తెలుస్తోంది.