CMKCR: ప్రస్తుతం వ్యవసాయం, విద్యుత్ రంగాలపైనే కేంద్రం కన్నువేసిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. కేంద్రం విధానాలపై కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఓడరేవులు, విమానాలు, అన్నీ పాయే.. రైలుపాయే.. రైలు స్టేషన్లు పాయే.. అన్నింటికి అన్నిపోతున్నయ్. ఇప్పుడు దీనికి సూటిపెట్టారు. ఇక రెండు మిగిలాయ్ ఒకటి వ్యవసాయరంగం. రెండోది విద్యుత్ రంగం. ఈ రెండు సావుకార్లకు అప్పజెప్పే వరకు మేం నిద్రపోం.. ఇది కేంద్ర ప్రభుత్వం శపథం. ఈ దీనికి అందమైన ముసుగుపేరు సంస్కరణ. చూడడానికి అందంగానే కనిపిస్తది. రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతరు.
రైతులు లాభం ఉన్నకాడ అమ్ముకోవచ్చని చెబుతరు.. బాన్సువాడ రైతులు ధాన్యం తీసుకుపోయి పంజాబ్‌లో అమ్ముతారా? అయ్యేపనేనా? గిట్టుబాటు అయ్యేపనేనా? చెప్పడానికి ఎక్కడ అమ్ముకోవచ్చు కాదా.. మంచిది కదా? ఫ్రీ మార్కెట్? దుబ్బాక వాళ్లు వచ్చి సిద్ధిపేటలో అమ్మే పరిస్థితి ఉండదు. రవాణా చార్జీలకే పోతే.. వీళ్లు పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లతో. వ్యవసాయ చేయలేకుంటనే అవుతున్నది. ఎకరం దున్నాలంటే గతంలో ఎంతుంటే.. ఇప్పుడు ఎంత అవుతున్నది. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్న మాట దగా. మోసం.. దాని పేరు మీద ఉన్న సిస్టమ్‌ను ధ్వంసం చేస్తున్నరు. దీనిపై వెనుక కుట్రను త్వరలో మళ్లీ వివరంగా చెబుతా’నన్నారు.
అసలు సంగతి కరెంటు బిల్లులు పెరగాలే.. మీటర్లు పెట్టాలే..
‘అసలు సంగతి ఎరువులు, డీజిల్ ధరలు, కోసే ధరలు పెరగాలే. కరెంటు బిల్లు పెరగాలే.. మీటర్లు పెట్టాలే.. చివరకు రైతు వ్యవసాయం తట్టా, పారా కింద పెట్టాలే.. పెడితే సావుకార్లు సూట్‌కేసులు పట్టుకొని దిగుతరు. మీతోని కాదు కార్పేరేట్ కంపెనీలు మేం సిద్ధంగా ఉన్నం. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులున్నయ్ మాకు వచ్చినం ఇగ. మీరు జరుగున్రి పక్కకు.. మాకు కంపెనీలకు అప్పజెప్పున్రి.. ఇండ్లనే కూలీకి పెని చేయండి.. ఇది ఇటు.. అటు ఆహార సబ్సిడీలు ఖతం పట్టించి రకరకాల పేరు మీద దాన్ని ఖతం చేస్తున్నది. చాలా బాధకరం. పరిణామ క్రమం ప్రజలకు తెలియజేయాలి.
ఎమ్మెల్యేలందరం, మంత్రులందరం ఢిల్లీలో ఆందోళన చేస్తే మాపై జోక్ చేస్తరు. ధాన్యం కొనాలంటే.. మెడకు పెడితే కాలుకు.. కాలుకు పెడితే మెడకు పెట్టారు. ఇక్కడి నుంచి ఓ కేంద్రమంత్రి ఉన్నడు.. ఆయనేం మాట్లాడతుడో దేవుడికే ఎరుక.. ఆ పార్టీ నాయకులేమో వరి వేయండి.. కొనిపిచ్చే బాధ్యత మాది అన్నరు. మంచోచెడ్డో రైతులు పంట వేశారు.. ఎవరూ పత్తాలేకుంట పోయారు. చెప్పినోడు పారిపోతే.. ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు నిష్క్రియా పరులైతే టీఆర్‌ఎస్, ఇతర పార్టీలు అక్కడ కోట్లాడితే కనీసం సంఘీభావం తెలుపకపోతే చివరకు.. గవర్నమెంట్‌కు గర్నమెంట్ అంతా పోయి ఢిల్లీలో ధర్నా చేశాం’ అని కేసీఆర్ గుర్తు చేశారు.
కేంద్రం అవహేళన చేసింది
‘ఆ సందర్భంలో జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితోపాటు మంత్రులు పోయి సంబంధిత మంత్రి పీయుష్‌గోయల్‌ను కలిస్తే.. తెలంగాణ చమత్కారం చేసిందా? క్యా జాదూ కరే అంటూ అవహేళన చేసినట్లు మాట్లాడారు. మీరు, మీ మనుషులు వచ్చి హెలికాప్టర్ వేసుకొని తిరుగుతు అని చెప్పాం. అబద్ధాలు చెబుతామా? పంట పొలం అగ్టిపెట్టెలో దాచిపెట్టేదా? వేల ఎకరాలకు కండ్లకు కనిపిస్తుంది కదా? ధాన్యం కొనమంటే మాకు స్థలం లేదు. ఎక్కడ పెట్టమంటారు అన్నరు. నూకలు అవుతయ్.. యాసంగిలో కొనాలంటే.. మీ తెలంగాణకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానిస్తారా? వాళ ఫలితం ఏంటంటే.. ఇవాళ ఏం జరుగుతుంది.
కేంద్రంలోని మంత్రులు, ప్రధానమంత్రి అవివేకం, అసమర్థతవల్ల దేశమే ఫుడ్ సెక్టార్‌లో ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. కేంద్రానికి ముందుచూపు ఏమైనా ఉందా? నాలుగైదు నెలల కింద మేం ధర్నా చేసే దుస్థితి. ఇవాళ నూకల ఎగుమతి బ్యాన్ చేసే పరిస్థితి. రైతులకు ధర రాకుండా అడ్డుకున్నదే తెలివి తక్కువ, అవివేక కేంద్ర ప్రభుత్వం. రైతుల నోట్లో మళ్లీ మన్నుపడుతున్నది. ఎఫ్‌సీఐ కొనకున్నా మార్కెట్ ఫ్రీ చేస్తే.. యూరప్, అమెరికాలో కరువు ఉన్నది ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. రకరకాల ఇబ్బందులున్నయ్. ఇవాళ డిమాండ్ వస్తున్నది. మళ్లీ ఇవాళ ఇదే రైతులను కేంద్రం దెబ్బకొడుతూ నోట్లో మన్నుకొడుతున్నది. అడ్డం తగులుతూ నూకల ఎగుమతిని బ్యాన్ చేసింది. 20శాతం ఎగుమతిపై ఎక్సైజ్ డ్యూటీ పెంచారు’ అని మండిపడ్డారు.
అసమర్థ విధానాలతో దుర్మార్గమైన ఫలితాలు..
అసమర్థ విధానాలు, దూరదృష్టి లేక, ఇతరులు చెబితే వినే లౌక్యం లేకపోవడంతో, సహనం కోల్పోయి అహంకార పూరితంగా వ్యవహరిస్తూ దుర్మార్గమైన ఫలితాలు తెస్తున్నరు.. ఇవి నిజాలు కావా? దీనిపై ఎక్కడైనా చర్చకు రెడీ. ఇలా ఎన్నో రంగాలను నాశనం పట్టిస్తున్నరు. ఇది ప్రజాస్వామ్యం.. ఇది ఉండకూడదట. భారతీయ జనతా పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల మంత్రులు, దురదృష్టవశాత్తు కొందరు ముఖ్యమంత్రులు ఎన్‌కౌంటర్లు చేస్తం అంటున్నరు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తది. జాతీయ జెండా ఎగురవేయకండి.. మీ ఇండ్ల మీద వేరే జెండా ఎగురవేయండి. జాతీయ జెండానే మార్చేస్తాం.. ఇదేనా దేశం వినాలా? ఇది మహాత్ముడు పుట్టిన గడ్డనేనా? ఈ మరుగుజ్జులు మాటలు వినాల్సిన ఖర్మనా మనది. ఎక్కడి నుంచి దాపురించారు ఈ దరిద్రులు.. మరుగుజ్జులు. దీని కోసమే అంబేద్కర్ రాజ్యాంగం రాసింది, ఇదేనా స్ఫూర్తి.
మహాత్ముడు పుట్టిన నేలపై ఈ మరుగుజ్జులు చంపేస్తాం.. కోసేస్తాం.. పార్టీనే ఉంచం.. ఈ దేశంలో ఒక పార్టీనే ఉంటది. డిక్లేర్ చేయండి మంచిదే కదా? బ్యాన్ చేయండి అన్ని పార్టీలను అర్జెంట్‌గా. మీ సంగతే.. మా సంగతో తెలుతుంది దేశంలో. వేరే పార్టీలను ఏవీ ఉంచం.. ఉండకుండా చేస్తామని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నడు. కేంద్ర హోంమంత్రి మనుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్ ఇచ్చాడు. దీనిపై పలు ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి.. కేంద్ర హోం మంత్రి ఏం మాట్లాడుతున్నడని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి నోటి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాటను ఈ దేశం నుంచి భరించవచ్చునా? ఇది ధర్మమేనా.. భారతదేశాన్ని నడిపించే పెద్దలు మాట్లాడే మాటలేనా? అహింసతో దేశాన్ని తీసుకువచ్చిన మహత్ముడు పుట్టిన నేల ఇది. ఎవరికి కిరీటం పెట్టడానికి? ఎవరిని కాపాడడానికి ఈ అరుపులు, పెడబొబ్బలు. ఈ పార్టీకి (బీజేపీకి) రెండుసార్లు 50శాతం ఓట్లు రాలేవు’ అన్నారు