– ఆ విషయంలో కన్ఫ్యూజన్ ఏమీ లేదు
– సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది కాంగ్రెస్ అధిష్ఠానం చూసుకుంటుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై అధికార బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకొనేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ విజయాన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. లేనివి ఉన్నట్లు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు భారాస మాటలు నమ్మొద్దన్నారు. ‘రుణ మాఫీ విషయంలో సీఎం కేసీఆర్ మాటతప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి విషయంలో మాకు స్పష్టత ఉంది. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు సీఎం ఎవరనేది నిర్ణయం తీసుకుంటాం.’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జీవోల విషయంలోనూ కేసీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.