ఇదేనిజం, శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి పాతుకు పోయిన అధికారులకు నూతన కమిషనర్ ఆమ్రపాలి ఇటీవల చెక్ పెడుతూ బదిలీ చేసిన విషయం విదితమే. అయితే శేరిలింగంపల్లి సర్కిల్ లో మాత్రం సాక్షాత్తూ కమిషనర్ ఆదేశాలు తుంగలో తొక్కి సీటు వదలకుండా అంటిపెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే 31/08/2024 నాడు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ D. రమేష్ శేరిలింగంపల్లి డివిజన్ నుంచి ఫలక్ నుమా సర్కిల్ కు బదిలీ చేశారు. మూసాపేట్ లో పనిచేస్తున్న ఆనంద్ ను ఇక్కడకు బదిలీ చేశారు. కాగా ఈ ఇద్దరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బదిలీపై వెళ్లకుండా గణేష్ నిమజ్జనం పేరుతో కుంటి సాకులు చెబుతూ రిలీవ్ కాకపోవడం గమనార్హం. పైగా పొలిటికల్ లీడర్లతోటి ఫోన్లు చేయించి అక్కడే విధులు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఉద్యోగులకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న జోనల్ కమిషనర్, ఈఈ లనుంచి సపోర్ట్ పుల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ అధికారులు జిహెచ్ఎంసి కమిషనర్ గారి ఆర్డర్స్ ని కూడా ఉల్లంఘించడం చూస్తుంటే వారికి ఎంత పెద్ద స్థాయిలో అండదండలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఇద్దరు ఇంజనీర్లపై అవినీతి ఆరోపణలు రావడం వల్లే ట్రాన్స్ఫర్ జరిగినా వీరు కుర్చీ వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేరంటే దీన్నిబట్టి చూస్తే ఎన్ని సంవత్సరాల నుండి వీళ్ళు ఏ లెవెల్ లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు .ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమిషనర్ వీరిపై దృష్టి సారించి బదిలీ వేటు నుంచి తప్పుకోకుండా చూడాలని కోరుతున్నారు.