– నిర్మలా సీతారామన్, డీకే శివకుమార్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం
– సీఎం కేసీఆర్‌కు అన్నదాతల ప్రయోజనాలే ముఖ్యం
– మంత్రి హరీశ్ రావు వెల్లడి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో ఆమె స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు నిధులు ఆపేశామని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారని అన్నారు. బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.‘తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉంటే ఈ పాటికే మీటర్లు ఏర్పాటు చేసేవారు. రైతుల ఇంటికి బిల్లులు వచ్చేవి. కేసీఆర్ ఆ ప్రయత్నాలు అడ్డుకున్నారు కాబట్టే రైతులు సురక్షితంగా ఉన్నారు. దేశంలోని 12 రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెట్టాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. మరికొన్ని రాష్ట్రాలు దరఖాస్తులు చేసుకున్నాయని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పంది ఒక్క కేసీఆర్ మాత్రమే. 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం రూ.25 వేల కోట్లు వదులుకున్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు లేకుండా చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. రాజస్థాన్, హిమాచల్, కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా మీటర్లు పెట్టడానికి అంగీకరించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో కూడా మోటార్లకు మీటర్లు వస్తాయి. కాంగ్రెస్,బీజేపీ రైతుల పాలిట శత్రువులు. ఆ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో తెలిసిపోయింది. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి వస్తే ఆ సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఆ రెండు పార్టీలు ఆ హామీని అమలు చేయలేదు. దాంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.’అని హరీశ్ రావు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ 100 లక్షల కోట్ల అప్పు చేసింది
బీజేపీ పాలనలోని కేంద్ర ప్రభుత్వం 100 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర జీఎస్‌డీపీ తెలంగాణ అప్పులు 28 శాతం. దేశ జీడీపీలో బీజేపీ అప్పులు 57 శాతం. రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. అలాంటిది ఓట్ల సమయంలో నిర్మలా సీతారామన్ వచ్చి తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు. బీజేపీ చేసిన 100 లక్షల కోట్ల అప్పులతో కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసింది. పేదలకు మాత్రం వడ్డీ తీసుకొని రుణాలు ఇస్తోంది. కేసీఆర్ ప్రతి పైసా పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం వెచ్చించారు. దేశంలో రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతోంది అంటే దానికి కారణం బీజేపీ కాదా? నిరుద్యోగిత రేటు అత్యధికంగా మారింది బీజేపీ హయాంలో కాదా? రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200 చేసింది బీజేపీ కాదా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు.