ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావస్తోంది. రైతులేమో విత్తానాలు దొరక్క నానాతంటాలు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా నిష్ప్రయోజనం. రాళ్లు, కాగితాలు, పుస్తకాలు క్యూలో పెట్టాల్సిన దుస్థితి. ఎప్పుడో పది, పదిహేనేళ్ల క్రితం ఉండేది ఈ గతి. గత ప్రభుత్వ హయాంలో ముందుగానే నిర్ణయాలు తీసుకొని సకాలంలో రైతులకు విత్తనాల సరఫరా జరిగేది. ఎరువులు, మందులు, ధాన్యం కొనుగోలు, గన్నీ సంచుల లభ్యత, మద్దతు ధర, పంట నష్ట పరిహారం ఇలా ఏ అంశాన్ని చూసుకున్నా వేగంగా స్పందించి కీలక నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవం. గత పదేళ్లలో రైతు ఏనాడూ రోడ్డెక్కలేదు. రైతులకు కావాల్సిన అవసరాలను ప్రభుత్వం ముందే గ్రహించి పక్కా ప్రణాళిక ప్రకారం వారి అవసరాలను తీర్చేది.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు దాటింది. కొత్త ప్రభుత్వం కదా సెట్ అవ్వడానికి కొంచెం టైం ఇద్దామని వెయిట్ చేశారు. కానీ సమస్యలు మాత్రం గుట్టలుగుట్టలుగా పెరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం మీద కక్షతో ప్రజల మీద తన ప్రతాపాన్ని చూపుతున్నట్లు కనబడుతోంది. కాళేశ్వరం నీళ్లను పంటలకు రానీయకుండా రైతులను ఇబ్బంది పెట్టింది ఈ ముసలి టీం. ఇప్పుడు విత్తనాలు అందుబాటులో లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవేమీ పట్టనట్లు సీఎం రేవంత్ మాత్రం రాష్ట్ర అధికార చిహ్నంపై దృష్టి సారించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలా? ఆడంబరాల కోసం, సోకుల కోసం చేసే మార్పులకు ప్రాధాన్యత ఇవ్వాలా? సరైన టైమింగ్ అనేది లేక ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు ఈ గుంపుమేస్త్రి. మిగిలిన ముసలి నాయకత్వం ఏదో చేద్దాంలే..చూద్దాంలే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇవే కాక ఇంకా మున్ముందు సవాలక్ష సవాళ్లు ఉన్నాయి. వాటన్నిటినీ ఛేదిస్తుందా లేక చాప చుట్టేస్తుందా ఈ ప్రభుత్వం అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.