- సబ్బండ వర్గాల వ్యతిరేకత
- పింఛన్లు పెంచకపోవడంతో అవ్వాతాతల అసంతృప్తి
- రైతు బంధు పెంచలేదు..
- ఆడబిడ్డలకు తులం బంగారం, లక్ష రూపాయలు రాలేదు
- విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదు
- బస్సులు ఫ్రీ ఉన్నా పల్లెల్లో ఆపడం లేదు
- కౌలు రైతుల ఊసులేదు.. రైతు కూలీల జాడలేదు
- నిరుద్యోగ లోకం నిరసనల గళం
- జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు..
- కొత్త నౌకర్లు ఇవ్వలేదు..
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయ్యింది. హస్తం ప్రభుత్వం మీద ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. గత ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి గెలిపించిన నిరుద్యోగులు ఇప్పుడు కడుపుమండి రగిలిపోతున్నారు. రైతు బంధు 15 వేలు ఇస్తారని నమ్మి ఓటేసిన అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఇక పింఛన్లు నాలుగువేలు పెంచుతారని నమ్మిన అవ్వాతాతల లోలోపల కుమిలిపోతున్నారు. నెల నెలా 2,500 సాయం ఇస్తామంటే నమ్మి మద్దతు తెలిపిన మహిళా లోకం.. చీపుర్లు తిరిగేసేందుకు రెడీ అయిపోయింది. ఇక విద్యార్థినులకు స్కూటీలు లేవు.. ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష సాయంతోపాటూ తులం బంగారం లేదు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం మాత్రం అమలవుతోంది. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల సరిపోయినన్నీ బస్సులు అందుబాటులో లేవు. కొన్ని పల్లెల్లో స్టాప్స్ వద్ద కేవలం మహిళలే ఉంటే డ్రైవర్లు ఆపడం లేదు. ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాలు అసంతృప్తితోనే రగిలిపోతున్నాయి.
కాలయాపన..
100 రోజుల్లో హామీలు అమలు చేస్తామంటూ మొదట ప్రకటించారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు అయ్యాక హామీలు చేస్తామన్నారు. కోడ్ తమకు అడ్డం పడుతుందన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ .. హామీల అమలు మీద లేదని సాధారణ ప్రజలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు వానాకాలం మొదలైనా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందలేదు. ఈ విషయంలో ప్రభుత్వం గందరగోళంలో ఉంది. ఐదెకరాలు అని ఓ సారి.. పదెకరాలు అని మరోసారి రకరకాల ఆరోపణలు చేస్తూ.. మార్గదర్శకాల పేరిట.. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పేరిట కాలయాపన చేస్తోంది. పెట్టుబడి సాయం.. పంట విత్తేముందే ఇస్తే రైతుకు ఉపయోగపడుతోంది. అంతేకాని పంట వేశాక తమకు సాయం చేస్తే ఉపయోగం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు బంధు పథకంలో లబ్ధిదారులను వీలైనంత మేర తగ్గించి.. ఆర్థికభారం తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే రైతు కూలీలకు సైతం ఏడాదికి 12వేలు సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు కూలీలకు సాయం చేసేందుకు ఏ అడ్డంకులు లేవు కానీ.. రైతు కూలీలకు సైతం ఇవ్వడం లేదు. దీంతో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి రైతు భరోసా విషయంలో చిత్తశుద్ధి ఉందా? లేదా? అన్న డౌట్స్ వస్తున్నాయి.
నౌఖర్లు ఏవీ?
నిజానికి బీఆర్ఎస్ సర్కారును గద్దె దించడంలో నిరుద్యోగులు, యువత పాత్ర ఎంతో కీలకం.. బీఆర్ఎస్ సర్కారు తమను పట్టించుకోలేదని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని.. గ్రూప్ 1 లాంటి పరీక్షను సక్రమంగా నిర్వహించలేదని నిరుద్యోగులు బీఆర్ఎస్ సర్కారు మీద ఆగ్రహంతో రగిలిపోయి కాంగ్రెస్ ను గెలిపించారు. తాము పవర్ లోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు ఈ హామీని గట్టున పెట్టింది. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. గత సర్కారు హాయంలో పరీక్షలు నిర్వహించి.. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక కేవలం నియామక పత్రాలను మాత్రం రేవంత్ అందజేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది కూడా ఈ రెండు నోటిఫికేషన్ల విషయంలోనే కావడం గమనార్హం. ఇటీవల రేవంత్ రెడ్డి ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను ఉద్దేశించి కిరాయి తీసుకొనే నిరసనలు తెలుపుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లని ఆరోపించడం .. నిరుద్యోగులకు కడుపుమండేలా చేసింది. మొత్తంగా రాష్ట్రంలో నిరుద్యోగులు రేవంత్ సర్కారు మీద రగిలిపోతున్నారు.
మహిళలకు నయవంచన
తాము పవర్ లోకి వస్తే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళలంతా మురిసిపోయారు. తమకు కూడా నెలనెల ప్రభుత్వ సాయం అందుతుందని నమ్మారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం వారికి చాలా తొందరగానే బోధపడింది. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా.. ఈ పథకం విషయంలో కనీసం ఎటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో మహిళలు రగిలిపోతున్నారు. రేవంత్ హామీ ఇచ్చిన కొత్త పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పాత పథకాలనైనా కొనసాగిస్తారా? లేదా? అన్న డౌట్స్ వస్తున్నాయి. కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, లక్ష నగదు ఇస్తామన్నారు. ఆ పథకం విషయంలో ఇప్పటివరకు అతీ గతీ లేదు. ఇక అమ్మాయిలకు స్కూటీ ఊసే లేదు.
రుణమాఫీ సర్వరోగ నివారిణా?
రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే తాము సేఫ్ గా ఉండొచ్చని రేవంత్ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే ఎంపీ ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్లినా రుణమాఫీ చేస్తానంటూ ఒట్లు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రుణమాఫీ విషయంలో కొంత హడావుడి కనిపిస్తోంది. కానీ ఈ పథకమైనా పూర్తి స్థాయిలో చేస్తారా? లేదంటే నిబంధనల పేరుతో కొర్రీలు పెడతారా? అన్నది వేచి చూడాలి. మొత్తంగా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ సర్కారు మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.