– కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దతునిస్తున్నది
– బీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటే
– కేసీఆర్‌ది నియంత పాలన
– జగిత్యాల విజయభేరి సభలో రాహుల్ గాంధీ విమర్శలు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దుతు ఇస్తోందన్నారు. లోక్ సభలో అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని రాహుల్ తెలిపారు. విజయభేరీ బస్సు యాత్రలో భాగంగా చివరి రోజు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో పర్యటిస్తున్నకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం జగిత్యాలలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు.‘గతంలో లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యాక ఢిల్లీలోని నా ఇంటిని ఖాళీ చేయించారు. కానీ నా ఇల్లు.. దేశ ప్రజల హృదయాల్లో ఉంది. బలహీనవర్గాల జనాభా లెక్కలు ఉండాలని కేంద్రాన్ని కోరాను. ఓబీసీలు దేశానికి వెన్నెముక లాంటివారు. వారికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోదీ, కేసీఆర్ సిద్ధంగా లేరు. ఓబీసీల సంఖ్య ఎంతో ఎందుకు లెక్కలు తీయరు? బడ్జెట్‌లో వారికి ఎంత ఖర్చు చేస్తున్నారో ఆలోచించాలి. దేశంలో, రాష్ట్రంలో ఓబీసీలు 50శాతం వరకు ఉన్నారు. ప్రజల జేబు నుంచి డబ్బు సేకరించి అదానీ జేబులోకి పంపిస్తున్నారు. దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్యనే ఈ ఎన్నికలు. తెలంగాణకు కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తాం. ప్రజలతో మా పార్టీకి ఉన్నది ప్రేమ, అనుబంధం. కాంగ్రెస్‌కు, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది. నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా నుంచి ప్రజలతో మాకు అనుబంధం ఉంది. చిరు వ్యాపారికి చెందిన టిఫిన్ సెంటర్ వద్ద దోశ వేయడం చాలా సంతోషాన్నిచ్చింది ’అని రాహుల్ అన్నారు.