Homeరాజకీయాలురాజస్థాన్​లో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

రాజస్థాన్​లో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

– మళ్లీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ
– రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణం
– ప్రభుత్వ కాలేజీలో చేరే స్టూడెంట్లకు ల్యాప్​టాప్​లు, ట్యాబ్​లు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు హస్తం పార్టీ కీలక హామీలు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపింది. ఇక, రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. జైపూర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీఎం అశోక్‌ గెహ్లాట్, సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా..

తాజాగా ‘కులగణన’ను ఇందులో చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ‘కులగణన’ ప్రస్తావన తీసుకొచ్చారు. అధికారంలోకి వస్తే తాము దేశవ్యాప్తంగా కచ్చితంగా కులాల వారీగా గణన చేపడుతామని తెలిపారు. తాజాగా అదే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఏడాదికి రూ.10వేల క్యాష్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం, రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణాలు, పంటలకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్​లతో పాటు మరిన్ని హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23 వరకు ప్రచారానికి గడువు ఉంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తమ మేనిఫెస్టోను ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img