ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రి. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చక్రం తిప్పినవాడు. ఒకప్పుడు ఎక్కిన ఫ్లైట్ ఎక్కకుండా తిరిగిన పెద్దాయన.. ఇప్పుడు మోపెడ్ మీద కనిపించాడు రఘువీరా రెడ్డి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత ఆయన ఇలా మారిపోయారు.
కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసి.. తన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామానికి వెళ్లిపోయారు.
మడకశిర, కళ్యాణ దుర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రఘువీరా రెడ్డి! అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ, వ్యవసాయం వంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేశారు. ఒక దశలో సీఎం రేస్ లో నిలిచారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే 2014తో పాటు 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలవ్వడంతో రఘువీరారెడ్డి ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరమై..తన స్వగ్రామైన నీలకంఠాపురం గ్రామానికి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి రఘువీరారెడ్డి లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ గడిపిన ఆయన తన గ్రామంలో ఒక సామాన్యుడిలా ఉంటున్నారు.
పగలంతా వ్యవసాయం పనులు, ఆలయ నిర్మాణ పనులు చేస్తుంటారు.
పంచె కట్టి, పేటా చుట్టి.. అచ్చం ఒక రైతులా కాలం గడుపుతున్న రఘువీరా..చాలా కాలం తర్వాత కెమెరాలకు కనిపించారు.
మొన్న పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో.. తన స్వగ్రామం నీలకంఠాపురం నుంచి గంగులవాయిపాళ్యం పంచాయతీకి ఓటు వేసేందుకు భార్యతో కలిసి మోపడ్ మీద వచ్చారు.
గ్రామస్థులను ఆప్యాయంగా పలుకరిస్తూ.. క్యూలైన్లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగినా కనీసం ఎక్కడా డిపాజిట్ కూడా రాని పరిస్థితి.!