ఇదే నిజం, తెలంగాణ బ్యూరో : కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించొచ్చు కానీ నిర్దోషులమైనా మాకు ఉద్యోగాలు ఇవ్వరా.. ఇది ప్రజా పాలన కాదు.. దగా పాలన అంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. 2022లో ఉద్యోగాలకు ఎంపికైనా కేసుల సాకుతో తమను ట్రైనింగ్‌కు పంపించడం లేదంటూ పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రజా భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభ్యర్థి మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం వచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగానికి ఎంపికయ్యామని, మెడికల్ టెస్టుల్లో కూడా క్వాలిఫై అయ్యామని తెలిపారు. డ్రెస్ కొలతలు కూడా తీసుకొని, ఒక్క రోజులో ట్రైనింగ్ ఉందనగా తమను ఆపేశారన్నారు. కారణాలేంటని అడిగితే తమపై కేసులు ఉన్నాయని చెప్పారన్నారు.
అయితే ఆ కేసులు క్లియర్ అయ్యాయని మొత్తుకుంటూ, ట్రైనింగ్‌కు పంపించాలని కోరుతూ సీఎం, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి సమాధానం రావడం లేదన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం వస్తున్న సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో కానిస్టేబుల్ అభ్యర్థి మాట్లాడుతూ.. సీఎం మీద కేసుల్లేవా అని ప్రశ్నించారు. ఆయన మీద కేసులున్నా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు.. కానీ మా మీద కేసులుంటే ఇలా రోడ్ల మీద తిరగాల్సి వస్తుందన్నారు. తమపై ఉన్న కేసుల్లో హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిందని, అయినా న్యాయం జరగడం లేదని వారు పేర్కొన్నారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని, ట్రైనింగ్‌కు వెళ్లేందుకు ఆగస్టు 6 వరకు మాత్రమే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి వరకు న్యాయం జరగకపోతే మళ్లీ నాలుగేళ్లు వేచి చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.