ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఏపీలో కూటమి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. డిప్యుటీ సీఎం అవుతారని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై పవన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆసక్తిని తెలిపాడు. తనకు కాలుష్య నివారణపై పోరాడాలని ఉందట. వ్యవసాయం, రైతుల సమస్యలపై పనిచేయడం ఇష్టమట. ఇరిగేషన్ వల్ల రైతులకు మేలు చేయాలనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వ్యవసాయ శాఖ, లేదా అటవీశాఖ మంత్రిగా పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
భారతదేశంలో ఎక్కువగా పంటలు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉంటుంది. నిత్యం సవాళ్లు, సమస్యలు ఉండే శాఖ. అటువంటి కీలక శాఖను ఇప్పటివరకూ ఎమ్మెల్యేగా అనుభవం లేని వ్యక్తికి ఇస్తే సమర్థంగా పనిచేయగలడా అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గొప్పలకు పోయి కేటాయించినా ఆశించిన మేర పనిచేయలేకపోతే విమర్శలపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో తెలంగాణలో తాటికొండ రాజయ్యకు డిప్యుటీ సీఎం పదవి కేటాయించి అసమర్థత కారణంగా తీసేసిన విషయం తెలిసిందే. అందుకే సినిమాటోగ్రఫీ, అటవీశాఖ, దేవాదాయ శాఖ , పర్యాటక శాఖ వంటివి కేటాయిస్తే బాగుంటుందని వాళ్ల అభిప్రాయం. గతంలో చిరంజీవి కూడా కేంద్రంలో ఎంపీగా గెలిచి పర్యాటక శాఖ మంత్రిగా చేశారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం సీఎం, డిప్యుటీ సీఎం అవుతారంటూ గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ ఫీల్డ్‌లోకి దిగినవాళ్లకే తెలుస్తుంది ఆ బాధ్యత ఎంత కష్టమో!