రాజ్‌కోట్: కరోనా కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. కనీసం సాటి మనిషి అన్న సృహ కూడా వైద్య సిబ్బందిలో ఉండటం లేదనిపిస్తోంది. తాగేందుకు మంచినీళ్లు అడిగిన పాపానికి హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కలిసి కరోనా పేషెంట్‌ని కొట్టిచంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 10 రోజుల ముందు జరిగిన ఈ సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రభాకర్ పాటిల్ రెండు వారాల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో కరోనా బారీన పడ్డాడు. దాంతో సెప్టెంబర్ 8న రాజ్‌కోట్ కోవిడ్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా లేకపోవడంతో నర్సింగ్ సిబ్బందిని అడిగాడు. దాంతో కోపోద్రోక్తులైన నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ప్రభాకర్ మీద దాడి చేశారు. ఎవరో దీన్ని వీడియో తీయడంతో అది వైరల్ అయింది. మరో విచారకర విషయం ఏంటంటే దేబ్బలకు తాళలేక ప్రభాకర్ సెప్టెంబర్ 12న మరణించినట్లు అతని సోదరుడు విలాస్ పాటిల్ మీడియాకు తెలిపాడు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం తనకి అంత్యక్రియలు కూడా చేయలేదని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విలాస్ డిమాండ్ చేస్తున్నాడు.