We will welcome the new caller tune on the phone. The central government will play this new caller tune to educate the public on corona vaccines.
‘‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. జాగ్రత్త వహించండి. అత్యవసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లాలి. ముక్కు, మూతిపై మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి’’.. ఇదీ మొదట్లో ఎవరికి ఫోన్ చేసినా వినిపించిన కాలర్ ట్యూన్. ఆ తర్వాత అది మారిపోయింది. ‘అన్ లాక్ ప్రక్రియ మొదలైపోయింది’ అంటూ మరో కాలర్ ట్యూన్. వాటికి తోడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా తనవంతు గాత్రదానం చేశారు. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి విషయాలపై కాలర్ ట్యూన్ ద్వారానే అవగాహన కల్పించారు.
ఇకపై, ఆ కాలర్ ట్యూన్ లు బందైపోనున్నాయి. ఆగండాగండి.. పూర్తిగా బంద్ అయిపోతోందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. దానికి బదులుగా ఇంకో కొత్త కాలర్ ట్యూన్ రాబోతోంది. ఏంటో తెలుసా..? శుక్రవారం నుంచి కరోనా వ్యాక్సిన్లు వేయనున్నారు కదా.. అదిగో, దానిపైనే మనకు ఫోన్ లో కొత్త కాలర్ ట్యూన్ స్వాగతం చెప్పనుంది. కరోనా టీకాలపై జనానికి అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కాలర్ ట్యూన్ ను వినిపించనుంది.
‘‘కరోనా అంతానికి టీకా రూపంలో కొత్త సంవత్సరం ఓ కొత్త వెలుగును తీసుకొచ్చింది. దేశంలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితమైనవి. ప్రభావవంతమైనవి. కరోనాను ఎదుర్కొనేందుకు వాటి నుంచి రోగ నిరోధక శక్తి వస్తుంది. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. లేనిపోని వదంతులను నమ్మకండి’’ అంటూ కొత్త కాలర్ ట్యూన్ సాగుతుంది.