Homeజిల్లా వార్తలునకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు

నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు

ఇదే నిజం కామారెడ్డి : కామారెడ్డి జిల్లా నకిలీ నోట్ల తయారీముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.56లక్షల నకిలీ కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించిన సామగ్రిని సీజ్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ శనివారం వెల్లడించారు. ఈనెల 13వ తేదీన బాన్సువాడ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి ఓ కారులోని వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా కారులో రూ.30లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడగా, అందులోని ముగ్గురు వ్యక్తులు కడపత్రి రాజగోపాల్, కొలవార్ కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాజగోపాల్ కర్ణాటకకు చెందిన హుస్సేన్ పీరాతో కలిసి నకిలీ నోట్లు తయారు చేసేందుకు పెట్టుబడి పెట్టి తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతో ముఠా ఏర్పాటు చేశారు. బోయిన్ పల్లిలోని అంటిలియా అపార్ట్ మెంట్ లోని పెంట్ హౌస్ ను నెలకు రూ.లక్ష చొప్పున అద్దె చెల్లిస్తూతీసుకున్నారు. అందులోనే నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్నారు. మొత్తం రూ.60లక్షల విలువైన నకిలీ కరెన్సీని తయారు చేశారు. అందులో నుంచి రూ.3లక్షల నకిలీ కరెన్సీని బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేశ్ గౌడ్ కు చలామణి నిమిత్తం ఇచ్చారు. వారు నకిలీ కరెన్సీని చలామణి చేయడంతో 13వ తేదీన రాజగోపాల్ మరో రూ.30లక్షల నకిలీ కరెన్సీని తీసుకువచ్చి కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్ కు ఇచ్చారు. ముగ్గురూ కలిసి కారులో వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు అంటిలియా అపార్ట్ మెంట్ కు వెళ్లి రూ.26లక్షల 90వేల విలువైన రూ.500 నోట్ల నకిలీ కరెన్సీ, నకిలీ నోట్ల తయారీకి వినియోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img