తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగగా.. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24రౌండ్లలో, అత్యల్పంగా 13రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,400మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని వికాస్‌రాజ్ తెలిపారు. అలాగే కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని సీఈవో వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. కౌంటింగ్ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా సెల్‌ఫోన్లు ఉండకూడదని, కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని పేర్కొన్నారు.